రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
జయశంకర్ భూపాలపల్లి, మే 20: మండలాల పరిధిలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను సంబంధిత తహశీల్దార్లు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో మండల తహశీల్దార్లతో రెవిన్యూ సమస్యలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్వే నెంబర్ల వారిగా ఎంత భూమి ఉంది, అట్టి భూమిలో ఎంత మంది రైతులు వున్నారు, డిజిటల్ పట్టాలు ఎంత మందికి వున్నాయి, ఎన్ని ఎకరాలకు ఉన్నది, ఎంత మందికి పట్టాలు రాలేదు అనే విషయాలను రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. అటవీ, రెవిన్యూ శాఖల మధ్య భూ సమస్యలు రికార్డుల ప్రకారం పరిష్కరించాలన్నారు. భూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చోట ఎంజాయ్మెంట్ సర్వే, జాయింట్ సర్వేలు చేపట్టాలన్నారు. మీ సేవ ద్వారా కమ్యూనిటీ ధ్రువీకరణ కొరకు 364, నివాస ధ్రువీకరణ కొరకు 155, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ కొరకు 162, ఆదాయ ధ్రువీకరణ కొరకు 331 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయన్నారు. మీ సేవ దరఖాస్తుల పెండింగ్ పై ప్రతి సోమవారం సమీక్ష చేసి, టైం బాండ్ ప్రకారం పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూడాలన్నారు. సక్సేషన్, పిఓబి కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. విరాసత్, సాదా బైనామా కేసుల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలన్నారు.ఈ సమీక్ష లో జిల్లాలోని తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.