లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతి అధికారి

నల్లగొండ: అక్రమ ఇంటి నిర్మాణానికి సంబంధించి క్షేత్రస్థాయి నివేదిక అందించేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు నేరెడుగొమ్ము మండల ఆర్‌ఐ ఓర్సు శ్రీను.ఏసీబీ డీఎస్పీలు శ్రీకష్ణగౌడ్, సుదర్శన్ బాధితుడు రెడ్యలు తెలిపిన వివరాల ప్రకారం…..నేరెడుగొమ్ము మండలంలోని పందిరిగుండుతండా గ్రామపంచాయతీ పరిధిలోని పైమూలవాగుతండాకు చెందిన రెడ్య భార్య కమ్లీకి సర్వే నెం.630లోని ప్లాట్‌ నెం.13ను కేటాయించారు.అలాగే రెడ్య తల్లి కోమటికి అదే సర్వే నెంబర్‌లోని ప్లాట్‌ నెం.11ను ఇంటి నిర్మాణం కోసం 1996 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కేటాయించింది.అయితే గత కొన్నేళ్ల క్రితం రెడ్య కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు.కాగా 2020సంవత్సరంలో స్వగ్రామానికి వచ్చిన రెడ్య కుటుంబ సభ్యులు ప్రభుత్వం తమకు కేటాయించిన ప్లాట్లలో అక్రమ నిర్మాణం జరుగుతుండడాన్ని గుర్తించి 2020 మే30న అప్పటి తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.దీంతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని తహసీల్దార్‌ సంబంధిత సర్వేయర్, ఆర్‌ఐ, వీఆర్వోలకు సూచించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన సర్వేయర్‌ నివేదిక అందించగా ఆర్‌ఐ మాత్రం ఆ నివేదిక అందించకుండా తాత్సారం చేస్తూ వచ్చాడు.క్షేత్రస్థాయి నివేదిక తహసీల్దార్‌కు అందించి తనకు న్యాయం చేయాలని ఆర్‌ఐని రెడ్య కోరుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే రూ.20వేలు లంచం డిమాండ్‌ చేశాడు నేరెడుగొమ్ము ఆర్‌ఐ ఓర్సు శ్రీనివాసులు. ఈ విషయమై ఏసీబీ అధికారులకు రెడ్య ఫిర్యాదు చేశాడు.ఈ క్రమంలో మంగళవారం ఆర్‌ఐకి రెడ్య ఫోన్‌ చేయగా దేవరకొండలోని ఇంటి వద్ద కలవాలని సూచించాడు. దీంతో దేవరకొండలోని ఆర్‌ఐ ఇంటి వద్ద రూ.20వేలు లంచం ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆర్‌ఐని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అక్కడి నుంచి ఆర్‌ఐను నేరెడుగొమ్ము తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించి సోదాలు నిర్వహించారు. విచారణలో భాగంగా దేవరకొండలోని ఆర్‌ఐ ఇంట్లో మహబూబ్‌నగర్‌ ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు లింగస్వామి, నర్సింహలు సోదాలు జరిపారు.కాగా ఈ మేరకు కేసునమోదు చేయడం జరిగిందని, పట్టుబడిన ఆర్‌ఐని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సోదాలు జరిపిన వారిలో ఇన్‌స్పెక్టర్లు వెంకట్రావు, రామారావు, సిబ్బంది తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.