గల్లంతైన మత్స్యకారులు క్షేమం: మంత్రి అప్పలరాజు

అమరావతి: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల గల్లంతు కాలేదని, క్షేమంగా ఉన్నారని ఏపి మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. వారిని అండమాన్ తీరంలో బోటులో గుర్తించారన్నారు.

వారంతా ఈ రోజు సాయంత్రానికి చెన్నై తీరానికి మరో బోట్ సాయంతో చేరనున్నట్లు మంత్రి వెల్లడించారు. వారిని క్షేమంగా చేర్చుతున్న ప్రభుత్వానికి, అధికారులకు, ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బందికి మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల గల్లంతు అంటూ సమాచారంపై మంత్రి అప్పలరాజు దృష్టికి వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి తెలియచేశారు. సిఎం సంబంధిత అధికారులతో చర్చించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ ని సమన్వయం చేసుకొని నిన్నటి సాయంత్రం నుండి గాలింపు చర్యలు ముమ్మరం చేయగా నిన్న రాత్రి అండమాన్ తీర ప్రాంతానికి దగ్గరలో ఆ బోటును గుర్తించారు.

బోటులో ఉన్నవారందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు ధ్రువీకరించారు. ఆ బోటును మరొక బోట్ సాయంతో ఈ రోజు సాయంత్రానికి చెన్నై తీరప్రాంతానికి తీసుకొని వస్తున్నట్టు తెలిపారు. బోటులో ఉన్నవారందరూ క్షేమంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అప్పలరాజు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.