పార్లమెంటుకు సైకిల్ పై టిఎంసి ఎంపీలు
న్యూఢిల్లీ: సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేలా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై తృణముల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపిలు నిరసిస్తూ పార్లమెంటుకు సైకిల్ పై వచ్చారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా ధరలు పెంచుతున్నారంటూ మండిపడ్డారు.
దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ లీటర్ ధర రూ.100 కు పైగా విక్రయిస్తున్నారు. ఆరుగురు టిఎంసి పార్లమెంటు సభ్యులు తమ అధికారిక నివాసాల నుంచి సైకిల్ పై వచ్చారు. కరోనా నిబంధనలు అనుసరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశ ప్రజలు ఉపాధి లేకుండా అల్లాడుతుంటే ధరలు పెంచడం అన్యాయమని ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతామని, బిజెపి ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు.