పోలీసు స్టేషన్… కూర్చోమంటే గొంతు కోసుకున్నాడు…
హైదరాబాద్: కొద్ది సేపు కూర్చుంటే ఫిర్యాదు తీసుకుంటామని పోలీసులు చెప్పినందుకు మనస్థాపానికి గురైన ఒక వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మెహిదీపట్నం రింగ్ రోడ్డు సమీపంలో భోజగుట్ట మురికివాడ ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్న హరికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా, ఒక భార్య అతని మొబైల్ ఫోన్ లాక్కున్నది. మరో భార్యతో కలిసి హరి ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. తనకు, భార్యకు గొడవ జరిగిందని, మరో భార్యతో కలిసి వచ్చానని చెప్పాడు. భార్యాభర్తల మధ్య తగవులు ఉంటాయని, కొద్ది సేపు కూర్చున్న తరువాత ఫిర్యాదు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఆ మాటలకు మనస్థాపానికి గురైన హరి తన వెంట తెచ్చుకున్న బ్లేడ్ తో గొంతు కోసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయించారు.