టెస్లా ఈవి కారులో మంటలు… తప్పించుకున్న యజమాని
పెన్సిల్వేనియా: ప్రస్తుతం ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్ల యుగం నడుస్తోంది. క్రూడాయిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో గత రెండు మూడు సంవత్సరాలుగా పలు ఆటోమోబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీపై దృష్టి సారించాయి.
ఎలక్ట్రిక్ వెహికిల్స్ లో టెస్లా కంపెనీ మోడళ్లు దూసుకువచ్చాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఒక కారు మంటల్లో చిక్కుకుని బూడిదైంది. అమెరికాలో జరిగిన ఈ ఘటన తో టెస్లా కార్ల భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్త మార్క్ గెరాగోస్ ఇటీవలే ఎస్ ప్లెయిడ్ కారును కొనుగోలు చేశాడు. జూలై 1వ తేదీన కారును తీసుకుని బయలుదేరాడు. పది కిలోమీటర్లు దాటిన తరువాత ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మార్క్ బయటకు దిగేందుకు ప్రయత్నించాడు. డోరు తెరుచుకోకపోవడంతో ఎలాగోలా కష్టపడి డోరు తీసుకుని బయటపడ్డాడు. ఈ ఘటనపై కారు యజమాని మార్క్ షాక్ కు గురయ్యాడు.
టెస్లా కంపెనీ ఎస్ ప్లెయిడ్ పేరుతో రిలీజు చేసిన కారు ధర 1,29,900 డాలర్లు. భద్రతలో వోల్వో కన్నా ఉత్తమమని టెస్లా ప్రకటించుకున్నది. ప్రఖ్యాత కంపెనీ కావడంతో పలువురు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. తాజా ఘటనతో పలువురు యజమానులు భీతిల్లిపోతున్నారు.