హైదరాబాద్: ప్రగతి భవన్ లో మంగళవారం సమావేశమైన మంత్రి మండలి పెండింగ్ లోని మిగతా ఏజెండా అంశాలపై చర్చించేందుకు ఇవాళ మళ్లీ సమావేశమవుతోంది.
సిఎం కెసిఆర్ అధ్యక్షతన మంగళవారం నాడు ఏడున్నర గంటల పాటు సుధీర్ఘంగా సమావేశమైంది. ఉద్యోగ ఖాళీల భర్తీకై చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కొరకు రేపు కూడా కేబినెట్ సమావేశం కొనసాగనుంది. బుధవారం జరిగే సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులను పూర్తి వివరాలతో హాజరు కావాలని మంత్రి మండలి ఆదేశించింది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక, పిసిసి అధ్యక్షుడిగా ఏ.రేవంత్ రెడ్డి రాకతో మారనున్న రాజకీయ సమీకరణలపై చర్చించనున్నారు. మంగళవారం నాటి సమావేశంలో అన్నిరకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్ మెంట్ కోసం ‘వార్షిక నియామక కేలెండర్’ (Annual Recruitment Calendar) ను తయారు చేసి అందుకు అనుగుణంగా విధిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించింది.
ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎంకు చేసిన విజ్ఞప్తి మేరకు కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే చేపట్టాలని, ఖాళీల గుర్తింపు మరియు భర్తీ ప్ర్రక్రియ సత్వరమే జరగాలని కేబినెట్ ఆదేశించింది. హైదరాబాద్ నగర శివారులోని మున్సిపాలిటీల పరిధిలో మంచినీటి సమస్యపై మంత్రి మండలి చర్చించింది. ఇప్పటికే విడుదల చేసిన నిధులకు అదనంగా మరో రూ. 1200 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువల పెంపునకు పచ్చజెండా ఊపారు. 2013లో పెరిగిన మార్కెట్ విలువలే ఇప్పటికి అమలులో ఉన్నాయి. దీంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీ 6 శాతం నుంచి 7.5 శాతం పెంచారు.