తెలంగాణలో టిడిపి ఉంటుంది: చంద్రబాబు
హైదరాబాద్: ‘‘తెలంగాణలో తెలుగుదేశం కొనసాగి తీరుతుంది.. అనుమానాలకు తావేలేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలని తెలంగాణ టిడిపి నేతలకు ఆయన నిర్దేశించారు. అలసత్వానికి తావివ్వకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని, ప్రజలతో మమేకమవ్వాలని దిశానిర్దేశం చేశారు.
తాను ప్రతినెలా సమయమిస్తా.. సమీక్షిస్తానని భరోసా ఇచ్చారు. టిడిపి అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా చేసిన నేపథ్యంలో చంద్రబాబు శనివారం తన నివాసంలో కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో, పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జిలతో మూడు గంటలపాటు సమావేశం నిర్వహించారు. రమణ రాజీనామా దృష్ట్యా, టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న దానిపై తుది నిర్ణయాన్ని చంద్రబాబుకే అప్పగించారు. కాగా, తెలంగాణ లో బహుళ రాజకీయ వ్యవస్థ వచ్చిందని, అభివృద్ధి చేయనివాళ్లు చేసినట్లు భ్రమలు కల్పిస్తున్నారని సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు.
ఒకట్రెండు రోజుల్లో కొత్త అధ్యక్షుడు ఎంపికలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకుల అభిప్రాయాన్ని చంద్రబాబు తెలుసుకోనున్నట్లు నాయకులు చెప్పారు. నూతన అధ్యక్షుడికి సంబంధించి ప్రకటన, ఒకటి రెండురోజుల్లో వెలువడుతుందని ఒక నాయకుడు తెలిపారు. ముగ్గురు లేదా ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని చంద్రబాబుకు నేతలు ప్రతిపాదించారు.