మంత్రి బుగ్గన పిట్ట కథలు: ఎమ్మెల్సీ అశోక్ బాబు

అమరావతి: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కట్టుకథలు, పిట్టకథలు చెప్పడం మానేసి, ఏ ప్రభుత్వ హాయాంలో ఎంత సంక్షేమం, అభివృద్ధి జరిగాయో వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని టిడిపి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు డిమాండ్ చేశారు.
అలానే కేపిటల్ వ్యయానికి ఈ రెండేళ్లలో పెట్టిన ఖర్చెంతో కూడా బహిర్గతం చేయాలి. ప్రభుత్వం చేసిన అప్పులు, ఇతర ప్రభుత్వసంస్థలకు ఎంతమొత్తం అప్పులకు ప్రభుత్వం గ్యారంటీ ఉందనే వివరాలను కూడా బహిర్గతంచేయాలన్నారు. బుగ్గన వాస్తవాలు చెప్పుకుండా సిఎఫ్ఎంఎస్ విధానం తప్పని, కేంద్రప్రభుత్వం అప్పులుచేయడం లేదా అని దబాయిస్తున్నాడన్నారు. సిఎఫ్ఎంఎస్ విధానం తప్పయితే, దాన్నెందుకు రద్దుచేయకుండా వినియోగిస్తున్నారు?. కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయమెంత.. ఏపి ప్రభుత్వానికి వస్తున్నఆదాయమెంత? తేల్చాలి.

లిక్కర్, పెట్రోల్ డీజిల్ పై ఎన్నడూలేనంత ఆదాయం ప్రభుత్వానికి వస్తున్నా, రెండేళ్లలో రూ.లక్షా70వేలకోట్ల అప్పులుచేశారన్నారు. చేసిన అప్పులన్నీ సంక్షేమానికి వినియోగిస్తున్నామనడం పచ్చి అబద్ధం. టిడపి ప్రభుత్వహాయాంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలతో తాము చర్చకు సిద్ధమని అశోక్ సవాల్ చేశారు.
ఈ ప్రభుత్వంలో అమలైన సంక్షేమంపై బుగ్గన చర్చకు వస్తాడా? అన్నారు. రాజకీయ విమర్శలతో టిడిపి వారిని, ప్రజలను కట్టడి చేయగలరేమోగానీ, కేంద్ర ప్రభుత్వాన్ని, కాగ్ ని చేయలేరన్నారు. రూ.41వేల కోట్ల వ్యవహారంపై కాగ్ కు మంత్రి బుగ్గన చెప్పే సమాధానాన్ని ఆయనే స్వయంగా ప్రజల ముందుంచాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.