రఘురామ కు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఏపిలో వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణరాజుకు పదవి కి ముప్పు లేకుండా పోయింది. రఘురామ పై అనర్హత వేటు కోసం లోక్ సభ స్పీకర్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కడం లేదు. ఇలాంటి సమయంలో అనర్హత పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రఘురామరాజులో ఉత్సాహం పెంచాయి. చట్టసభలకు ఎన్నికైన సభ్యుల అనర్హత కోసం దాఖలైన ఫిర్యాదులను పరిష్కరించే విషయంలో లోక్ సభతో పాటు చట్ట సభల స్పీకర్ల పాత్రపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అనర్హత వేటు కోసం కుప్పలు తెప్పలుగా దాఖలవుతున్న ఫిర్యాదులను స్పీకర్లు సకాలంలో పరిష్కరించకపోవడంపై దాఖలైన ఓ పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజా ప్రతినిధుల అనర్హత పిటిషన్లపై మరింత స్పష్టతను ఇచ్చింది.

అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకునే విషయంలో మన దేశంలో ప్రజాప్రాతినిధ్య చట్టం మాత్రమే ఉందని గుర్తు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం స్పీకర్లకే సర్వాధికారాలు కట్టబెట్టిందని వ్యాఖ్యానించింది. చట్ట రక్షణ ఉండడం మూలంగా ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ నిస్సహాయత వ్యక్తం చేసింది. అనర్హతల పై నిర్ణయం తీసుకునే సర్వాధికారం చట్ట సభల స్పీకర్లకే ఉందంటూ తేల్చి చెప్పిం. దీంతో అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు కాలపరిమితి పెట్టాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పశ్చిమబెంగాల్ పిసిసి సభ్యుడికి నిరాశే ఎదురైంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్లు కాల పరిమితితో నిర్ణయం తీసుకునేలా చేయాలంటే పార్లమెంటు మాత్రమే చట్టం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.