ఆదిలాబాద్ నుంచే ప్రస్థానాన్ని ప్రారంభిస్తా: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ఆదిలాబాద్: ఆదిలాబాద్ నుంచే నా ప్రస్థానాన్ని ప్రారంభిస్తానని వీఆర్‌ఎస్ ప్రకటించిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని వ్యాఖ్యానించారు. రాజకీయాలతోనే మొత్తం వ్యవస్థ మారుతుందనుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) ప్రకటించారు. ఇంకా ఆరేళ్ల సర్వీసు మిగిలే ఉన్నా.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన వీఆర్‌ఎస్‌ దరఖాస్తును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సోమవారం ఈ-మెయిల్‌ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ప్రవీణ్‌కుమార్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరి, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఆ పార్టీ తరఫున పోటీకి దిగుతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. కానీ, దీనిని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు కొట్టిపారేస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితోనే వీఆర్‌ఎస్‌ ప్రకటించిన ప్రవీణ్‌కుమార్‌, ఆ పార్టీలో చేరుతారని ఊహించటం కష్టమని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. ఇక ప్రవీణ్‌కుమార్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి వ్యతిరేకమైనందున.. బీజేపీలోనూ చేరే అవకాశం లేదు. ‘జై భీం’ పేరుతో కొత్త పార్టీ పెడతారని, లేకపోతే రాష్ట్రంలో బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) బాధ్యతలు చేపట్టి, రాజకీయంగా ముందుకు వెళ్తారని సన్నిహితులు అంచనా వేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.