40 లక్షల మంది మహమ్మారికి బలి: ఐరాస
న్యూయార్క్: కరోనా వైరస్ మహమ్మారి మొదలు ఇప్పటి వరకు 40 లక్షల మందిని బలితీసుకున్నదని ఐక్య రాజ్య సమితి (యుఎన్) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మహమ్మారిని ఓడించేందుకు ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరాన్ని ఈ భయంకరమైన మైలురాయి గుర్తు చేస్తున్నదన్నారు. మరిన్ని వ్యాక్సిన్లు, ఎక్కువ సమానత్వంతో వేగంగా ముందుకు కదలాల్సిన అవసరం ఉందని ఆయన ట్వీట్ చేశారు. కరోనా సృష్టించిన విలయం అంతఇంతా కాదని, చాలా మంది మౌనంగా అనుభవించారని విచారం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తప్ప మరో మార్గం లేదని, వ్యాక్సిన్ పంపిణీ కన్నా వైరస్ వేగం ఎక్కువగా ఉందన్నారు. దీన్ని మనం అరికట్టకపోతే మరెందరో ప్రాణాలకు ముప్పు ఉన్నట్లేనని ఆయన హెచ్చరించారు. వ్యాక్సిన్ కార్యాచరణ అమలు చేయాల్సి ఉందని గుటెరస్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.