ఆధార్ కేంద్రాల్లో బాదుడే బాదుడు

అమరావతి: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కోసం ఆధార్ అనుసంధానం చెయ్యాల్సి రావడంతో జనం ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. బ్యాంక్, పోస్టాఫీస్ లల్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలల్లో భారీగా వసూళ్లు చేస్తున్నారంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆధార్ కేంద్రాలల్లో సవరణలకు రూ.50 బాదులుగా రూ.150కి పైగా, అదేవిధంగా బయోమెట్రిక్ కోసం రూ.100 బాదులుగా రూ.500కు పైగా వసూలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఈ దోపిడిపై చర్యలు తీసుకోకపోవడంతో ఆధార్ కేంద్రాల నిర్వాహకులు ఆడిందే ఆటగా సాగుతోంది. తగినన్ని ఆధార్‌ కేంద్రాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా, మార్పులు, చేసుకోవాలనుకున్నా బ్యాంక్ లేదా పోస్టాఫీస్ లోని ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి వస్తున్నది. అక్కడికి వెళ్లినా పనులు కావడం లేదు. పట్టణ ప్రజలతో పాటు మండలాల ప్రజలు కూడా రావడంతో రద్దీ నెలకొంటున్నది. ఇప్పటికైనా ఈ దోపిడికి అడ్డుకట్ట వేసేందుకు మరిన్ని కేంద్రాలను తెరవాలని, మీ సేవ లో కూడా వీటిని ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఆధార్ కోసం ఎంత మంది వస్తున్నారు, ఎన్ని లావాదేవీలు జరుగుతున్నాయనే వివరాలు సేకరించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.