టిఆర్ఎస్ లో చేరిన రమణ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ కు గులాబి కండువా కప్పి పార్టీలోకి టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆహ్వానించారు. రమణతో పాటు ఆయన అనుచరులు కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
టిఆర్ఎస్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో చేనేత వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని, ఇందుకు సంబంధించి త్వరలోనే శుభవార్త అందిస్తానని తెలిపారు. చేనేత వర్గం సమున్నతంగా బతికేందుకు కృష్టి చేస్తామన్నారు. రమణకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని, రమణ చేరికతో పార్టీలో చేనేత వర్గం లేదన్న లోటు తీరిందన్నారు. చేనేత కార్మికులకు రైతు బీమా కోసం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమను ప్రోత్సహిస్తే సూరత్, ముంబై నుంచి తిరిగి వస్తామని కార్మికులు తెలిపారన్నారు. వరంగల్ లో వేయి ఎకరాల్లో మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేసుకుంటున్నామని కెసిఆర్ చెప్పారు.