దేశంలో 4 లక్షలు కాదు… 40 లక్షల మంది మృతి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇండియాలో మరణాలపై అనేక అనుమానాలు ఉన్నాయి. మరణాలతో పాటు పాజిటివ్ కేసుల లెక్కలు కూడా బహిర్గతం చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.
అందరూ అనుమానిస్తున్న విధంగా ప్రభుత్వాలు ప్రకటించిన మరణాల కన్నా పది రెట్లు అధికంగా కరోనా మరణాలు సంభవించాయని సర్వే లెక్కలు తేల్చాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంతటి పెను విషాదం ఎప్పుడూ చూడలేదని సర్వే తేల్చేసింది. ఈ సర్వే నివేదికను మంగళవారం నాడు అధికారికంగా విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తో పాటు సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్ మెంట్, హార్వర్డ్ యూనివర్సిటీ కి చెందిన ఇద్దరు రీసెర్చర్లు సర్వే చేశారు. 2020 జనవరి నుంచి 2021 జనవరి మధ్య కరోనా కారణంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 30 లక్షల నుంచి 47 లక్షల మధ్య ఉంటుందని లెక్కగట్టారు. దేశ విభజన సందర్భంగా 1947లో హిందూ, ముస్లింల గొడవల్లో పది లక్షల మందికి పైగా చనిపోయారు. అంతకన్నా పెద్ద విషాదంగా కరోనా మరణాలను చెప్పుకోవచ్చు.
మూడు పద్ధతుల్లో కరోన మరణాలపై సర్వే నిర్వహించారు. ఏడు రాష్ట్రాల్లో జనన, మరణాలను నమోదు చేసే రిజిస్ట్రేషన్ వ్యవస్థ నుంచి వివరాలు సేకరించారు. ఇండియాలో వైరస్ ఎంత ప్రభలంగా ఉందో చెప్పే రక్త నమూనాల సంఖ్య, అంతర్జాతీయంగా కరోనా మరణాల రేటు, ఏడాది కాలంలో మూడుసార్లు 9 లక్షల మందిపై చేసే ఆర్థిక సర్వే ఆధారంగా మరణాలను లెక్కించారు. అన్ని రకరాల మరణాలను పరిగణనలోకి తీసుకుని గతేడాది మరణాలతో సరిపోల్చగా లెక్క తేలినట్లు రీసెర్చర్లు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాల్లోనే వైరస్ ప్రభావం అధికంగా ఉందని వెల్లడైంది. ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలోనే ఎక్కువ మరణాలు జరిగాయని సర్వే నివేదిక తేటతెల్లం చేసింది.