అన్ని పార్టీలు పిలిచాయి కాని వెళ్లను: కోమటిరెడ్డి
భువనగిరి: తనకు చాలా పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని, ఏ పార్టీలో చేరేది లేదని భువనగరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే అందరం నష్టపోతామని, గాంధీ భవన్ లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవలేమన్నారు.
తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి పోటీపడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డిని నియమించడంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
సీనియర్ నేతగా అలా మాట్లాడానని, వేరే ఉధ్దేశం లేదని ఆయన అన్నారు. ఇవాళ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా భువనగిరిలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తరువాత మీడియాతో మాట్లాడారు. అన్ని అర్హతలు ఉండి పిసిసి పదవి రాకుండా బాధ ఉండదా అని ఆయన ప్రశ్నించారు. పిసిసి పదవి రాకపోతే పార్టీ మారతరా, తెలంగాణ కోసం మంత్రి పదవి వదులుకున్న వ్యక్తినని అన్నారు. తనకు ఏ పదవి అక్కర్లేదని, భువనగిరి ప్రజలను సేవ చేసుకుంటానన్నారు. ఓటుకు నోటు మాదిరే పిసిసి అధ్యక్ష పదవిని విక్రయించారని వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై పలువురు నాయకులు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారు.