ప్రగతి భవనమా? ప్రైవేటు కంపెనీ ఆఫీసా?: రేవంత్
హైదరాబాద్: ప్రగతి భవన్ ప్రజల కష్టాలు విని, కన్నీళ్లు తుడవాల్సిన సీఎం కార్యాలయమా లేక కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కార్యాలయమా అని పిసిసి అధ్యక్షుడు, ఎంపి ఏ.రేవంత్ రెడ్డి విమర్శించారు.
కరోనా సమయంలో స్టాఫ్ నర్సులను దేవుళ్లని మీరే పొగిడారు… ఆ దేవుళ్లు ఇప్పుడు ప్రగతి భవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సిఎం కెసిఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఉన్నపళంగా ఉద్యోగాలు తొలగించి 1600 కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. ప్రగతి భవన్ కు వస్తే ఐదు నిముషాలు వాళ్ల గోడు వినే తీరిక మీకు లేదా అని ప్రశ్నించారు. 2018 లో ఎంపికైన ఎఎన్ఎం లకు ఇప్పటికీ పోస్టింగులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. స్టాఫ్ నర్సులను యథాతథంగా విధుల్లో కొనసాగించాలి.
2018 ఎఎన్ఎం అభ్యర్థులకు తక్షణం పోస్టింగులు ఇవ్వాలన్నారు. 50 వేల ఉద్యోగాల భర్తీ పై మీరు చేసిన ప్రకటన చీటింగ్ “వన్స్ మోర్” లాగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ నివేదిక ఇస్తే మీరు 50 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం ఏమిటన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ సంగతి ఏమిటో స్పష్టం చేయలేదన్నారు. ప్రభుత్వంలోని 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలతో పాటు, కార్పొరేషన్ల లోని ఖాళీల భర్తీకి తక్షణం షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అతి త్వరలో నిరుద్యోగ యువత తరఫున పిసిసి కార్యచరణ ఉంటుందని రేవంత్ రెడ్డి లేఖలో హెచ్చరించారు.