ఆ కులాలే గొప్పవా?: మంద కృష్ణ

హైదరాబాద్: హైటెక్ సిటీలో వెలమ కులం భవనానికి 5 ఎకరాలు, కమ్మ కులం భవనానికి 5 ఎకరాల చొప్పున భూమిని కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు.
వెలమ, కమ్మ కుల భవనాల భూముల కేటాయింపులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, సమాజంలో మరింతగా అసమానతలు కొనసాగే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఆత్మ గౌరవభవనాల భూమి కేటాయింపు, వనరుల విషయంలో అంతరాలు పెంచుతుందని ఆరోపించారు. కుల భవనాలు అన్ని ఒకే చోట స్థలాలు కేటాయించి ఒకే విధమైన వనరులు కేటాయించాలన్రు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అన్ని కులాల పేదలకు ఒకే చోట కేటాయించారు. మంత్రులు, ఎమ్మెల్యే క్వార్టర్స్ సామాజిక వర్గాలుగా వేరు వేరుగా లేవు కదా అన్నారు. వెలమ, కమ్మ కులాల ఉనికి హైటెక్ సిటీలో ఉండాలా కెసిఆర్ అని మంద కృష్ణ ప్రశ్నించారు.
బలహీన వర్గాలకు హైదరాబాద్ శివారులో రాళ్లు, రప్పల్లో ఇస్తున్నారు. ఒక్క కులానికి 5కోట్లు.. మరికొన్ని కులాలకు రూ.1కోటి కేటాయించడం ఏందన్నారు. కోట్ల విలువ చేసే భూములు వెలమ, కమ్మ కులాలకు కెసిఆర్ కట్టబెడుతున్నారు. తెలంగాణలోని 59 దళిత కులాలకు హైటెక్ సిటీలో సెంట్ భూమి ఎందుకు కేటాయించలేదో కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత సాధికారత గురించి కెసిఆర్ గొప్పగా చెపుతున్నారు. సామాజిక వర్గాల మధ్య అసమానతలు తలెత్తకుండా ఆత్మ గౌరవభవనాలు ఉండాలన్నారు. దళితులకు, గిరిజనులకు నిలువ నీడ లేకుండా కెసిఆర్ చేస్తున్నారు. కోకాపేటలోని భూములను వేలం వేసి వేల కోట్లు పోగేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములను వేలం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును దళితుల అభివృద్ధికి కేటాయిస్తామని కొత్త నాటకానికి తెర లేపాడు. ప్రతిపక్షాల వాదనలను కేసీఆర్ బలహీన పరుస్తున్నాడన్నారు.

కెసిఆర్ ప్రభుత్వ భూములను దళితులకు ఇళ్ల స్థలాలకు, వ్యవసాయానికి ఇవ్వడం లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చేందుకు భూమి కొనుగోలు చేస్తానని.. ప్రభుత్వ భూములను అమ్మడం దారుణమన్నారు. కెసిఆర్ ఏడేళ్ల పాలనలో దళితుల సంక్షేమంకోసం డాదాపు రూ.90వేల కోట్ల కేటాయింపులు చేశారు. దళితుల అభివృద్ధికి కేవలం రూ.55వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇంకా రూ.35వేల కోట్లు ఖర్చే చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎస్సి సబ్ ప్లాన్ నిధులు ఉన్నాయన్నారు. ఈ నెల 22న కెసిఆర్ దళిత సాధికారత బూటకం పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని మంద కృష్ణ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.