కెసిఆర్ తో కలిసి విక్రమార్క భజన: మంద కృష్ణ

మరియమ్మ కేసులో కెసిఆర్ తో డీల్ చేసుకున్నారు
సిబిఐ, ఈడి, పోలీసులు టిఆర్ఎస్ సర్కార్ కు వత్తాసు
హైదరాబాద్: కాంగ్రెస్ దళిత నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సిఎం కెసిఆర్ తో కుమ్మక్కై భజన చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

యాదాద్రి జిల్లాలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసును కెసిఆర్ నిర్వీర్యం చేస్తున్నారని. ఈ విషయంలో కేసీఆర్ కు డిజిపి ఎం.మహేందర్ రెడ్డి సహకరిస్తున్నారన్నారు. ఇవాళ మంద కృష్ణ మాదిగా మీడియాతో మాట్లాడుతూ, మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. పోలీసుల చిత్రహింసల వల్లే మరియమ్మ చనిపోయిందని డిజిపి కి క్లారిటీ ఉంది, కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని ఆరోపించారు. మరియమ్మ కొడుకును చర్మం ఉడిపోయేలా పోలీసులు కొట్టారు. మర్డర్ కేసు నమోదు చేయనప్పుడు ఎస్సై లను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటి?. ఈ కేసుపై జూన్ 5వ తారీఖు డిజిపి ని కలుస్తానని, ఈ 48 గంటల్లో డిజిపి చర్యలు తీసుకుంటే మంచిదన్నారు. రంగారెడ్డి జిల్లాలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి(దిశ) చనిపోతే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఎక్స్ గ్రేషియా ఇచ్చారు. కల్నల్ సంతోష్ బాబు చనిపోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి సహాయనిధి నుండే ఎక్స్ గ్రేషియా ఇచ్చారు. కానీ దళిత మరియమ్మ చనిపోతే సాంఘిక సంక్షేమ శాఖ నుండి ఎక్స్ గ్రేషియా ఇవ్వడం ఏంది? అని నిలదీశారు. మరియమ్మ విషయంలో కేసీఆర్ దళితులకు మూడు నామాలు పెట్టాడు. నీకు సరెండర్ అయ్యేవాళ్ళు అవుతారు. మేం ప్రజల తరపున కొట్లాడేవాళ్ళమని మందకృష్ణ మాదిగ అన్నారు.

తెలంగాణ డిజిపి కి కనీసం సోయి లేదా?. అత్యుత్సాహం వల్లే పోలీసు డిపార్ట్మెంట్ కి మచ్చ వస్తుంది. దళితులపై దాడులు, అత్యాచారాలు జరిగిన ప్రతిసారీ కేసులు కాకుండా చేస్తున్నారు. దీనికి మధ్యవర్తిత్వం వహిస్తున్నది కెసిఆర్ అన్నారు. ఈ కేసులో సిఎం, ఎమ్మెల్యే మల్లు విక్రమార్కతో డీల్ చేసుకున్నారు. విక్రమార్క నా ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. మరియమ్మ ది లాకప్ డెత్ అనుకుంటున్నావా? అనుకోవట్లేదా? అనేది స్పష్టం చేయాలన్నారు. విక్రమార్క లాంటి అమ్ముడు పోయే నాయకుల వల్ల దళిత సమాజం సిగ్గుపడుతుందన్నారు. టిఆర్ఎస్ లో ఉన్న దళిత మంత్రులు, నాయకులు తమ ఆత్మగౌరవాన్ని కెసిఆర్ కాళ్ళదగ్గర తాకట్టుపెట్టారు. కేంద్రంలో ఉండే సిబిఐ, ఈడి, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నారని ఆయన ఆరోపించారు. దీనివల్ల దళితులకు, గిరిజనులకు ఎక్కువ ప్రమాదమన్నారు. సమాచారం, ఆధారాలపై పనిచేయాల్సిన పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పనిచేస్తున్నారు. అట్రాసిటీ కేసుల్లోని దోషులకు హైకోర్టు ముందస్తు బెయిల్స్ ఇవ్వడం దారుణమన్నారు. సిరిసిల్లి జిల్లా నేరేళ్ల దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు, వామపక్షాలు కెసిఆర్ కు అంతర్గతంగా వత్తాసు పలుకుతున్నాయి. దళిత సాధికారత పేరుతో కెసిఆర్ మరో డ్రామ ఆడుతున్నాడు. దొరల తెలంగాణను ఓడించి, సామాజిక తెలంగాణ తేవడమే లక్షంగా త్వరలోనే పాద యాత్ర చేపడుతామన్నారు. సైద్ధాంతిక పోరాటం చేయడానికి కాంగ్రెస్, బీజేపీ సిద్ధంగా లేవు, వామపక్షాలు పోరాటాన్ని మర్చిపోయాయని మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.