సామాజిక తెలంగాణ కోసమే వెళ్తున్నా: రమణ
హైదరాబాద్: సామాజిక తెలంగాణ కోసం పని చేద్దామని, తనతో పాటు కలిసి రావాలని సిఎం కెసిఆర్ కోరారని టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు.
ప్రగతి భవన్ లో గురువారం రాత్రి పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలసి సిఎం కెసిఆర్ తో రమణ భేటీ అయ్యారు. భేటీ తరువాత బయటకు వచ్చిన రమణ మీడియాతో మాట్లాడారు. తమ మధ్య వివిధ అంశాలు చర్చకు వచ్చాయన్నారు. రాష్ట్రాల ఏర్పడిన తరువాత రాజకీయ పరిణామాలపై చర్చ జరిగిందని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని, సానుకూలంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పానని రమణ తెలిపారు. మంత్రి దయాకర్ మాట్లాడుతూ, రమణ అంటే కెసిఆర్ కు అభిమానమన్నారు. పద్మశాలీ కుటుంబం నుంచి వచ్చి రమణ టిఆర్ఎస్ కు అవసరమన్నారు. పద్మశాలీలకు చాలా చేశామని, ఇంకా చేయాల్సి ఉందన్నారు. ఇద్దరం కలిసి టిడిపిలో పనిచేశామని, శ్రేయోభిలాషులమని ఆయన చెప్పారు. తెలంగాణలో టిడిపి బతికే పరిస్థితి లేదని, అవసాన దశలో ఉందని దయాకర్ వ్యాఖ్యానించారు.