పాకిస్థాన్ లో బక్రీద్ విషాదం… 31 మంది దుర్మరణం

లాహోర్: పాకిస్థాన్ లో సోమవారం సాయంత్రం సంభవించిన బస్సు ప్రమాదంలో 31 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సియల్ కోట్ నుంచి రాజన్ పూర్ వెళ్తున్న ప్యాసెంజర్ బస్సును భారీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో కిక్కిరిసిన ప్రయాణీకులు ఉన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్సులో బయలుదేరారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. ఘటనా ప్రాంతం బాధితుల హాహకారాలతో హోరెత్తింది. బస్సుల్లో చిక్కుకున్నవారని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది నానా తంటాలు పడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయించారు. ప్రజా రవాణా వాహనాలను జాగ్రత్తగా నడపాలని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ ఛౌదరీ ట్వీట్ చేశారు. రోడ్డు ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 70 మంది ప్రయాణిస్తున్నారని డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ ఆఫీసర్ డాక్టర్ నయ్యర్ ఆలం తెలిపారు. ఘటనపై విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక అందచేయాలని పంజాబ్ చీఫ్ మినిష్టర్ ఆదేశించారు. అతి వేగంగా వెళ్లడం మూలంగా బస్సు ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. నేషనల్ హైవే లపై ఇష్టానుసారంగా బస్సులను నడుపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.