గోదావరి ఉగ్రరూపం.. నీటమునిగిన సీతమ్మ విగ్రహం
భద్రాచలం జూలై 22 ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో భద్రాద్రి దుమ్ముగూడెం వద్ద గోదావరినది ఉగ్రరూపం దాల్చింది. ఎస్సారెస్సీ ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉప్పొంగుతోంది. గురువారం ఉదయం నుంచి భద్రాద్రి వద్ద భారీగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో, పర్ణశాలలో స్వామివారి నారచీరలు ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. అటు, సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో మరో 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో, గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.