మోదీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ తొలిరోజు ప్రక్రియ విజయవంతంగా కొనసాగింది. ఎక్కడా ఎలాంటి ఆందోళనకర పరిణామాలు సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు వ్యాక్సిన్ పై పలువురు అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో… వ్యాక్సిన్ పై చాలా మందిలో అపోహలు ఉన్నాయని… అవి తొలగి పోవాలంటే ప్రధాని మోదీ వ్యాక్సిన్ వేయించుకోవాలని వంచిత్ బహుజన్ అఘాడి నేత ప్రకాశ్ అంబేద్కర్ సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలకు మద్దతు పలుకుతూ మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను చేపట్టనున్నట్టు చెప్పారు. షహీన్ బాగ్ ఆందోళనల సమయంలో సిక్కులు మద్దతు పలికారని… ఇప్పుడు రైతుల ఆందోళనలకు ముస్లింలు అండగా ఉంటారని తెలిపారు. రైతులకు అండగా నిలవడంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ విఫలమయ్యాయని విమర్శించారు. ఆందోళనల్లో కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కనిపించారని… ఆయన పార్టీ మాత్రం ఎక్కడా కనిపించలేదని దుయ్యబట్టారు.

Leave A Reply

Your email address will not be published.