జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కీలకంగా మారిందా? అమరావతి అంశమే గెలుపోటములను ప్రభావితం చేయబోతోందా? అంటే అవుననే తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణలో పెద్దగా చర్చ జరగకపోయినా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ అంశాలు ప్రచారాస్త్రాలుగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అమరావతి అంశం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. అమరావతి అంశం ఇప్పుడు కొన్ని పార్టీలను షేక్ చేస్తుందని చెబుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీమాంధ్రులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రాజధాని అమరావతి అంశమే ప్రభావితం చూపిస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలకు అమరావతి అంశం ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. కూకట్ పల్లి, శేరిలింగం పల్లి, ఏఎస్ రావు నగర్, సనత్ నగర్, దిల్ షుక్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో .. ఓట్ల కోసం తమ దగ్గరకు వస్తున్న బీజేపీ నేతలను అమరావతి పై ప్రశ్నిస్తున్నారట ఆంధ్రా ఓటర్లు. అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలనే విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలని కోరుతున్నారట. అమరావతి నిర్మాణ శంకుస్థాపన ప్రధాని మోడీ చేతుల మీదుగానే జరిగింది. కాని ఇప్పుడు అమరావతిని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నా బీజేపీ ఎందుకు స్పందించడం లేదు. ఏపీ బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా ప్రకటనలు చేస్తున్నా… కేంద్ర సర్కార్ మాత్రం రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుందంటూ కోర్టుల్లో అఫిడవిట్లు వేస్తోంది. దీనిపై ఆంధ్రా ఓటర్లలో ఆగ్రహం వ్యక్తమవుతోందని తెలుస్తోంది.