తెలంగాణ తొలి హోంమంత్రి కన్నుమూత!

రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి(80) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఇటీవల ఆయన కోవిడ్‌ బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్న తర్వాత నిమోనియా సోకింది. వారం రోజులుగా అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆసుపత్రికి వెళ్లి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచారు. నాయినికి భార్య అహల్య, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమతారెడ్డి ఉన్నారు. నాయిని అల్లుడు వి.శ్రీనివాస్‌రెడ్డి రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌. నాయినికి నలుగురు మనవళ్లు. భోళామనిషి: సోషలిస్టు జీవితం.. సాదాసీదా మనస్తత్వం.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే భోళాతనం.. నాయిని నర్సింహారెడ్డి సొంతం. సోషలిస్టుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అందరికీ అందుబాటులో ఉండే కార్మికనేతగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం చేసిన నాయిని రాష్ట్ర రాజకీయాల్లో జెయింట్‌ కిల్లర్‌గా అప్పట్లో సంచలనం సృష్టించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒకవైపు ఇందిరా కాంగ్రెస్‌ నుంచి అప్పటి కార్మిక మంత్రి టి.అంజయ్య, మరోవైపు రెడ్డి కాంగ్రెస్‌ నుంచి గతంలో కార్మిక మంత్రిగా పనిచేసిన జి.సంజీవరెడ్డిలతో ఆయన ఢీ కొన్నారు. ఆ ఇద్దరినీ ఓడించారు. 2,167 ఓట్ల మెజార్టీతో గెలుపొంది సంచలనం సృష్టించి జెయింట్‌ కిల్లర్‌గా ఖ్యాతిపొందారు. 1985లో రెండోసారి, 2004లో మూడోసారి అదేస్థానం నుంచి గెలుపొందారు. 2004లో వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ మంత్రిగా సేవలందించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌ నుంచి టీఆర్‌ఎస్‌ వైదొలగిన సమయంలో అమెరికాలో ఉన్న నాయిని అక్కడి నుంచే నేరుగా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన నిబద్ధతను చాటుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై హోంమంత్రిగా, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్‌ వెన్నంటి ఉండి ప్రత్యేక రాష్ట్ర సాధనలో నాయిని కీలకపాత్ర పోషించారు. సోషలిస్టు పార్టీ నుంచి ప్రస్థానం.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్మ గ్రామానికి చెందిన నాయిని నర్సింహారెడ్డి ఫిబ్రవరి 12, 1940లో జన్మించారు. హెచ్‌ఎస్‌సీ వరకు చదువుకున్నారు. మొదటి నుంచే చురుకైన విద్యార్థిగా ఉంటూ వచ్చిన నాయిని ఆ ప్రాంతంలో జరిగే ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొంటుండేవారు. ఈ క్రమంలోనే 1958 జనవరి 26వ తేదీన సోషలిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ పార్టీ సమావేశం నాగార్జున సాగర్‌లో జరగగా దానికి సోషలిస్టు నాయకుడు బద్రి విశాల్‌ పిత్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా స్థానిక నాయకుడు పాశం రుక్మారెడ్డితో సోషలిస్టు పార్టీ కార్యాలయంలో నమ్మకంగా పని చేయడానికి, చురుకైన ఓ కార్యకర్త కావాలని కోరగా అప్పుడు నాయిని నర్సింహారెడ్డి పేరును రుక్మారెడ్డి సూచించారు. దీంతో నాయిని ఆఫీసు కార్యదర్శిగా పని చేయడానికి 1962లో మొట్టమొదటిసారి హైదరాబాద్‌ వచ్చారు. ఈ క్రమంలో ఆఫీసు బాధ్యతలతోపాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. కార్మిక నాయకుడిగా ఎదిగిన వైనం... సోషలిస్టు పార్టీ జాయింట్‌ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా పదోన్నతి పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ట్రేడ్‌ యూనియన్‌ లీడర్‌గా మారి కార్మిక సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు. మొదట హమాలీ, తోపుడు బండ్ల కార్మికుల సమస్యలపై ఉద్యమించారు. నగరంలో మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించారు. కార్మిక నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. అనంతరం నాయిని నర్సింహారెడ్డి ప్రతిష్టాత్మకమైన వీఎస్‌టీ, ఐడీఎల్, హెచ్‌ఎంటీ, గంగప్ప కేబుల్స్, మోడ్రన్‌ బేకరి వంటి కంపెనీల్లో కార్మికనేతగా గెలుపొందడంతోపాటు సికింద్రాబాద్‌ హాకర్స్‌ యూనియన్, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్లకు అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ఈ క్రమంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీలో నాయిని నర్సింహారెడ్డిని అరెస్టు చేసి ముషీరాబాద్‌ జైల్లో 18 నెలల పాటు నిర్బంధించారు. ఎమర్జెన్సీ మొత్తంకాలం నాయిని జైల్లోనే గడిపారు. బుల్లెట్‌ వీరుడు.. మీసాల సూర్యుడు.. ముషీరాబాద్‌/సుందరయ్య విజ్ఞాన కేందం: ఆరడుగుల ఆజానుబాహుడు.. కోర మీసాలు.. వీటికి తోడు బుల్లెట్‌.. నాయిని నర్సింహారెడ్డి అనగానే గుర్తుకొచ్చేవి ఇవే. సోష లిస్టు పార్టీ భావాలతో ఎప్పుడూ నీతి, న్యాయం కోసం పోరాడేవారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇట్టే అక్కడికి చేరి వారికి న్యాయం జరిగే వరకు వెన్నంటే ఉండేవారు. అందువల్లే హైదరాబాద్‌ వచ్చిన అనతికాలంలోనే కార్మికుల పక్షాన నిలబడి వారి హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ ఆయనను ముద్దుగా బుల్లెట్‌ వీరుడు.. మీసాల సూర్యుడు అని పిలుచుకునేవారు. ఆయన ఏ గల్లీకి వెళ్లినా బుల్లెట్‌ ఉండాల్సి ందే. వయోభారం మీదపడ్డా.. బుల్లెట్‌ నడపలేని స్థితిలో ఉన్నా తన బుల్లెట్‌ను మాత్రం రోజూ తుడవడం, ఒకసారి స్టార్ట్‌ చేసి పక్క న పెట్టడం ఆయనకు అలవాటు. ముఖ్యం గా వాహనాలంటే ఆయనకు అమితమైన మోజు. మార్కెట్‌లోకి ఏ కొత్త వాహనం వచ్చినా దానిని ట్రయల్‌ చేసేవారు. రమిజాబీ కేసుతో వెలుగులోకి... 1978లో నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రమిజాబీ అనే ముస్లిం మహిళపై జరిగిన అత్యాచారం, దాడి ఘటన అప్పట్లో రాష్త్రాన్ని మొత్తం కుదిపివేసింది. బాధితుల పక్షాన నిలబడి నాయిని సుదీర్ఘ పోరాటం చేశారు. అప్పట్లో నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ను వేలాది మందితో ముట్టడించారు. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నల్లకుంట, ముషీరాబాద్‌ ప్రాంతాలలో కర్ఫ్యూ కూడా విధించారు. ఈ ఘటనతోనే నాయిని వెలుగులోకి వచ్చారు.

Leave A Reply

Your email address will not be published.