ఉల్లి ఘాటెక్కింది… రైతు బజార్ జనసంద్రమైంది
ఉల్లిపాయలు కోస్తే కళ్లలో నీరు వస్తుంది.. కాని ఇప్పుడు కొనేందుకు వచ్చినా నీరు వస్తోంది. భారీ వర్షాలకు ఉల్లి దిగుబడులు భారీగా పడిపోయాయి. దీంతో మార్కెట్ ఉల్లి రేటు వంద రూపాయలకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉల్లి కొనాలంటే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లి అందిస్తోంది. అనంతపురం రైతు బజార్లలో కిలో ఉల్లి 40రూపాయలకు అందిస్తోంది. దీంతో జనం అంతా రైతుబజార్ బాట పట్టారు. సుమారు కిలోపై 60రూపాయలు ధర తగ్గించడంతో ప్రజలు ఉల్లి కొనేందుకు ఎగబడుతున్నారు. శనివారం ఉదయం నుంచే రైతు బజార్ వద్ద భారీ క్యూలైన్ కనిపించింది. ఈ ఉల్లి కేంద్రాన్ని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని.. ఉల్లి ధరలు సాధారణ స్థాయికి వచ్చే వరకు ఈ కేంద్రాలు ఉంటాయన్నారు. అలాగే జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.