కొంప కాలి ఒకరు ఏడుస్తుంటే,చుట్ట కి నిప్పు దొరికిందని సంబర పడ్డాడట మరొకడు.!

బిజెపి కుట్రలు కొంప కాలి ఒకడు ఏడుస్తుంటే, చుట్ట వెలిగించుకోడానికి నిప్పు దొరికిందని సంబర పడ్డాడట మరొకడు! రాష్ట్రంలో బిజెపి కి అంతర్వేది అంశం అలాగే దొరికింది. ఆ నిప్పుతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చడానికి శత విధాల ప్రయత్నిస్తున్న తీరు జుగప్స కలిగిస్తోంది. దిగజారిన ఆర్థిక వ్యవస్థకు తోడు, ఏమాత్రం ముందస్తు ప్రణాళిక లేని లాక్‌డౌన్‌ కారణంగా దేశంతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఉద్యోగాలు ఊడి, ఉపాధి కోల్పోయి రోజు గడవడమే కష్టంగా మారిన వారు రాష్ట్రంలో ఎందరో...! వారి బాధలు బిజెపి నేతలకు పట్టలేదెందుకో? ప్రైవేటు ఉపాధ్యాయులు ఒక్క పూట భోజనం కోసం నానా అగచాట్లు పడుతున్న కథనాలు పత్రికల్లో వస్తున్నాయే...వారి కోసం కమలనాథులు గొంతు విప్పలేదెందుకని? అకస్మాత్తుగా ఎక్కడివక్కడ ఆగిపోవడంతో, సొంత ఊర్లకు సుదీర్ఘ పాదయాత్రలు చేసిన వలస కార్మికుల కన్నీళ్లు తుడవడానికి వారి చేతులు ఎందుకు రాలేదు? వ్యాపారాలు స్థంభించి, పెట్టిన పెట్టుబడి ఏమవుతుందో తెలియక. తమనే నమ్ముకుని పని చేస్తున్న వారిని ఏం చేయాలో అర్ధంకాక తీవ్ర మనోవేదనకు గురైన చిన్న, మధ్య తరగతి వ్యాపారస్తులు, పెట్టుబడిదారుల గురించి పెదవి విప్పి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? సామాన్యుల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రుల నయా దందాను ఖండించడానికి వీరి గొంతుకలు పెగలడం లేదెందుకనో? అంతర్వేదిలో జరిగిందేమిటి? లక్ష్మీ నరసింహ స్వామి రథం అర్ధరాత్రి అగ్నికి ఆహుతైంది. అది అనుకోకుండా జరిగిన ప్రమాదమైనా అయి ఉండాలి, లేదా ఎవరైనా కావాలని చేసిన పనైనా అయి ఉండాలి. ఈ విషయాన్ని తేల్చాల్సింది ఎవరు? దర్యాప్తు సంస్థలు! వాటిని ఆ పని చేయనీయాలి కదా! అనుమానాలు వుంటే వ్యక్తం చేయవచ్చు, ఆధారాలు వుంటే అందచేయవచ్చు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరవచ్చు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేయవచ్చు. కానీ, బిజెపి నేతలు చేస్తున్నదేమిటి? మనుషులను విభజిస్తున్నారు. మతాలవారీ మోహరింపునకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మత ప్రార్ధనా స్థలాలపై దాడి జరుగుతోందన్న ప్రచారాన్ని జాతీయ నాయకుల నుంచి స్థానిక నాయకత్వం దాకా ఎత్తుకున్నారు. ఇది రగిలి, అగ్నిగుండమై, ప్రజలు శలభాల్లా మాడుతుంటే ఆ మంటల్లో అధికార పేలాలు ఏరుకోవడానికి పావులు కదుపుతున్నారు. రాష్ట్ర బిజెపి ఇన్‌ఛార్జిగా సునీల్‌ డియోధర్‌ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చెబుతున్న మాటలు, ఇస్తున్న సంకేతాలు ఇవే కదా! ఈ విధ్వంస వ్యూహానికి జనసేన మద్దతు ఇవ్వడం, అండగా నిలవడం విచారకరం! వారి నాయకుడు దీపాలు వెలిగించి నిరసన తెలపాలని పిలుపునిస్తే, జనసైనికులు సంఘపరివార్‌ విద్వేష వ్యూహంలో ప్రత్యక్ష భాగస్వాములవుతున్నారు. కోతికి కొబ్బరికాయ చిక్కినట్టుగా జనసేన పరిస్థితి మారింది. చివరకు ఏమవుతుందో, ఎక్కడ తేలుతుందో చూడాల్సిందే! ఒకపక్క బిజెపి రాష్ట్ర అధ్యక్షుడేమో టిడిపి హయాంలోనూ దేవాలయాల ధ్వంసం జరిగిందని ఆరోపిస్తుంటే, దానిని పట్టించుకోనట్టు నటిస్తూ చంద్రబాబు వైసిపి హయంలో మెజార్టీ మతానికి రక్షణ లేకుండా పోయిందన్న బిజెపి వాదనను వల్లె వేస్తున్నారు. లౌకిక విలువలకు పట్టం కట్టే పార్టీ తమదని చెప్పుకుంటూ వచ్చిన టిడిపి కి ఇంతటి దుస్థితి వచ్చింది. రథం దగ్ధమైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. అదే సమయంలో మతం పేరుతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వారి విషయంలో ఏమాత్రం ఉదాశీనంగా వ్యవహరించకూడదు. తక్షణమే స్పందించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో, ప్రజాతంత్ర శక్తులు, లౌకికవాదులు, మేథావులు అప్రమత్తంగా వ్యవహరించాలి. మత సామరస్యానికి, ప్రగతిశీల భావాలకు, సంస్కరణ ఉద్యమాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్‌లో విద్వేష వ్యూహాన్ని ఎంతమాత్రం సహించేది లేదని ముక్త కంఠంతో నినదించాలి.

Leave A Reply

Your email address will not be published.