సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్‌కు మరో షాక్

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వులు ఎత్తేయాలని ప్రభుత్వం పిటిషన్‌‌లో పేర్కొంది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలిపింది. హైకోర్టులో విచారణ గురువారం ఉన్నందున తమ వద్దకు రావడం సరికాదని తెలిపింది. ప్రభుత్వ వాదనలు హైకోర్టులోనే వినిపించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ సందర్భంగా ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. పరిపాలన రాజధానిని వైజాగ్‌కి మార్చడానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ తరపు న్యాయవాది రాకేష్ ద్రివేది కోరారు. దీనిపై స్పందించిన సుప్రీం అనుమతికి నిరాకరించింది. ‘‘హైకోర్టు‌లో రైతులకు అనుకూలంగా తీర్పు వస్తే వైజాగ్‌కు రాజధానిని తరలించే ఖర్చు వృథా కదా? ఆ ఖర్చుకు ఎవరు బాధ్యత వహిస్తారు?’’ అంటూ న్యాయమూర్తి అశోక్ భూషణ్ ప్రశ్నలు సంధించారు. అనంతరం హైకోర్టులో విచారణ తర్వాతే ఏదైనా అని ధర్మాసనం తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.