నిర్లక్ష్యం ప్రభుత్వానిది…ఇబ్బందులు ప్రజలకు: చంద్రబాబు

అమరావతి: ఓ వైపు కరోనా, వరదలు.. మరోవైపు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలకు కష్టాలు వచ్చాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయగోదావరి జిల్లాల తెదేపా నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వరద నీటి నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కేంద్ర జలసంఘం హెచ్చరికలను బేఖాతరు చేసిందని ఆరోపించారు. వరద బాధితులపై రాజకీయ వివక్ష చూపడం హేయమన్నారు. ప్రభుత్వ పరిహారం అందించడంలో పార్టీలను చూస్తారా? అని నిలదీశారు. తిత్లీ తుపాను సమయంలో నిరాశ్రయులకు రోజుకు 1,35,650 మందికి భోజనాలు పెట్టామని గుర్తు చేశారు. 10 రోజుల్లో 13 లక్షల మందికి భోజనాలు వండించి అందజేశామన్నారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో ఆ స్ఫూర్తి కొరవడటం బాధాకరమని.. పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలా ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 100 శాతం సబ్సిడీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందజేయాలని కోరారు. వరద బాధితులను ఆదుకున్న తెదేపా నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే తెదేపా అని స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉండటం పార్టీ సామాజిక బాధ్యతని చెప్పారు. ప్రతి విపత్తులోనూ మానవతా దృక్పథంతో తెదేపా ప్రభుత్వం ఆదుకుందని.. వైకాపా ప్రభుత్వం ఇప్పుడు పైశాచిక ఆనందంతో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.