ఇది లాక్ డౌన్ 3.0 కాదు… ఎగ్జిట్ వ్యూహం 2.0!

దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి రెండు వారాల పాటు అమలుకానున్న నిబంధనలను ‘లాక్ డౌన్ 3.0’గా పరిగణించరాదని, లాక్ డౌన్ ను తొలగించే దిశగా, ‘ఎగ్జిట్ ప్లాన్ 2.0’గా గుర్తించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హాట్ స్పాట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో అన్ని రకాల కార్యకలాపాలనూ అనుమతించామని గుర్తు చేసిన ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్… ‘దీనిని ఎగ్జిట్ 2.0 అనండి, అంతేకానీ ఇది లాక్ డౌన్ 3.0 మాత్రం కాదు’ అని వ్యాఖ్యానించారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, కేసుల సంఖ్య అధికంగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీ నుంచి అన్ని నగరాలు, పట్టణాల్లో నిబంధనల సడలింపు ప్రారంభమైందని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తూ, తదుపరి సడలింపులు ఉంటాయని వ్యాఖ్యానించారు. ప్రైవేటు కార్యాలయాలను 33 శాతం ఉద్యోగులతో నడిపించుకునేందుకు, స్వయం ఉపాధి పొందుతున్నవారు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు, ప్రైవేటు వాహనాల రాకపోకలను అనుమతించామని గుర్తు చేశారు.

ఇండియాలోనే కేసుల సంఖ్య అధికంగా ఉన్న మహారాష్ట్రలోనూ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తెరచుకున్నాయని, పట్టణ ప్రాంతాల్లోని గ్రీన్ జోన్లు, ఆరంజ్ జోన్లలో పరిశ్రమలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లను తెరిచేందుకు ఓకే చెప్పామని లవ్ అగర్వాల్ గుర్తు చేశారు. లాక్ డౌన్ రెండో దశ నుంచే నిబంధనల సడలింపు ప్రారంభమైందని, అన్ని రకాల రవాణా వాహనాలనూ అనుమతించామని వెల్లడించారు.
Tags: Lockdown 3.0,Exit 2.0,Love Agarwal,Corona Virus

Leave A Reply

Your email address will not be published.