జయశంకర్ భూపాలపల్లి వివిధ సంక్షేమ హాస్టళ్ళు, ప్రభుత్వ పాఠశాలల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని వేలం నిర్వహించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అభివృద్ధి శాఖల అధికారులు మరియు జిల్లా విద్యాశాఖాధికారితో జెసి సమావేశం నిర్వహించి 2020 మార్చి మాసంలో కరోనా లాక్డౌన్ ప్రారంభమైననాటి నుండి వివిధ సంక్షేమ హాస్టళ్ళలో భోజనం మరియు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేసిన బియ్యం ఆయా విద్యాసంస్థల్లో నిలువ ఉండడం వలన చెడిపోయే ఆస్కారమున్నదని, వెంటనే అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్టల్లో నిలువ గల బియ్యాన్ని సేకరించి వేలం వేయాలని పౌరసరఫరాలశాఖ ఇన్చార్జి అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ మహమ్మద్ ముస్తఫా ను ఆదేశించారు. అలాగే ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు,కెజిబివి లలో గత సంవత్సరం నుండి నిలువలో ఉన్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అందజేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బిసి అభివృద్ధి అధికారి శైలజ, ఎస్సీ డెవలప్మెంట్ అధికారి సునీత, డిఈఓ హైదర్ హై, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.