జయశంకర్ భూపాలపల్లి, ఖాళీగా ఉన్న గ్రామపంచాయతీ, ఎంపీపీ, జెడ్పిపి ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ వివిధ కారణాలతో ఖాళీ అయిన గ్రామపంచాయతీ, ఎంపీపీ, జెడ్పిపి పదవుల భర్తీకి ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, ఏప్రిల్ 3 వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను,12 న ఫైనల్ ఓటర్ జాబితాను ప్రచురించాలని, ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని, బ్యాలెట్ బాక్సులను సరి చూసుకోవాలని, ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామకం చేయాలని, ఎన్నికల నిర్వహణ పై ముందస్తు శిక్షణ ఇప్పించాలని, బ్యాలెట్ పేపర్ లను ముద్రించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు మరియు సంబంధితశాఖల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు చేసేందుకు ముందస్తు సమావేశం నిర్వహించాలని, ఎన్నికల మోడల్ కోడ్ అమలుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆర్డిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 4 సర్పంచ్ స్థానాలు, 17 వార్డ్ సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయని ఆయా స్థానాల్లో ఎన్నికలను నిబంధనల మేరకు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, డిపిఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.