జయశంకర్ భూపాలపల్లి అక్రమ దత్తత చట్టరీత్యా నేరమని, పిల్లల్ని చట్ట ప్రకారమే దత్తత తీసుకోవాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ అన్నారు. మహదేవపూర్ మండలంలోని సూరారం గ్రామంలో గత నెల జన్మించిన మగ శిశువును కాళేశ్వరం కు చెందిన పిల్లలు లేని దంపతులు అక్రమంగా దత్తత తీసుకున్నారు. ఇట్టి విషయమై జిల్లా బాలల సంరక్షణ అధికారి మహాదేవపూర్ సిడిపిఓ రాధికతో కలిసి విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఇట్టి విషయం వాస్తవమేనని, కన్న తల్లిదండ్రులకు, ఇతర గ్రామస్థులకు చట్ట బద్ధమైన దత్తత పై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా డీసీపీఓ హరికృష్ణ మాట్లాడుతూ… పిల్లలు లేని దంపతులు ఎవరైనా దత్తత తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రీయ దత్తత ప్రాధికార సంస్థ (కారా) వెబ్ సైట్ట్లో చట్టబద్ధమైన దత్తత కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పిల్లలను పోషించలేని తల్లిదండ్రులు తమ చిన్నారులను అక్రమంగా దత్తత ఇవ్వకుండా, మహిళాభి వృధ్ది, శిశు సంక్షేమ శాఖకు అప్పగిస్తే పిల్లలు లేని వారికి చట్ట బద్దంగా దత్తత ఇస్తారన్నారు. ఈ విదంగా చేయడం ద్వారా పిల్లల కు వారసత్వపు హక్కులు అందించబడతాయని, అక్రమంగా దత్తత కు పాల్పడినట్లైతే పిల్లల హక్కులకు భంగం కలగడమే కాకుండా, వారి భవిష్యత్తు అందకారమయం అవుతుందని తెలిపారు. అంతేకాకుండా, కన్న తల్లిదండ్రులను, అక్రమంగా దత్తత తీసుకున్న దంపతులను బాబుతో సహా బాల రక్షా భవన్ కార్యాలయంలో ఉన్న బాలల సంక్షేమ సమితి ముందు ఈ శుక్రవారం హాజరు కావాలని, లేనిచో చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి ఎ.వెంకటస్వామి, అంగన్వాడీ టీచర్స్, గ్రామస్థులు పాల్గొన్నారు.