Home Special Stories గాంధీ విగ్రహం ధ్వంసంపై భారతీయ సమాజం నిరసన ర్యాలీ!

గాంధీ విగ్రహం ధ్వంసంపై భారతీయ సమాజం నిరసన ర్యాలీ!

0
0

వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం డేవిస్ నగరంలో గాంధీ విగ్రహం ధ్వంసానికి నిరసనగా భారతీయ అమెరికన్లు నిరసన ర్యాలీ చేపట్టారు. కాలిఫోర్నియాలోని సిటీ పార్కులో ఈ ర్యాలీ నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. 2016లో భారత ప్రభుత్వం ఆరు అడుగుల ఎత్తు, 294 కిలోల బరువు గల గాంధీ కాంస్యపు విగ్రహాన్ని అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహాన్ని అగ్రరాజ్యం కాలిఫోర్నియాలోని డేవిస్ నగరంలో ఉన్న సెంట్రల్ పార్కులో ప్రతిష్టించింది. అయితే, జనవరి 27న కొందరు గుర్తు తెలియని దుండగులు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో శాంతికి, సమానత్వానికి ప్రతీక అయినా మహాత్ముడికి ఇలా అవమానం జరగడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించడంతో పాటు దీనిని హేయమైన చర్యగా పేర్కొంది. అటు భారతీయ అమెరికన్లు కూడా ఈ ఘటనపై మండిపడ్డారు. తాజాగా ఈ ఘటనను నిరసిస్తూ సిటీ పార్కులో నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో అసోసియేషన్ ఆఫ్ సాక్రమెంటో (ఐఏఎస్)‌తో పాటు పలు భారతీయ, హిందూ సంఘాలు పాల్గొన్నాయి. ఇక ఈ ర్యాలీలో పాల్గొన్న డేవిస్ సిటీ మేయర్ గ్లోరియా పర్తిడా మాట్లాడుతూ గాంధీ విగ్రహం ధ్వంసం చేయడమనేది క్షమించరానిది. గాంధీ మన మార్గదర్శకుడు. ఆయనకు ఇలాంటి అవమానం జరగడం శోచనీయం అని అన్నారు. అలాగే యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా రిటైర్డ్ ప్రొఫెసర్, గాంధీ స్టాచ్యూ ఫర్ పీస్ కమిటీ మెంబర్ శ్యామ్ గోయల్ ఈ ఘటన తనకు షాక్‌కు గురి చేసిందన్నారు. రిపబ్లిక్ డే తర్వాతి రోజే గాంధీకి ఈ అవమానం జరగడం తీవ్రంగా బాధించిందని తెలిపారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఇదిలాఉంటే.. కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు గాంధీ విగ్రహం ధ్వంసం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేయడం గమనార్హం. అలాగే సిటీ పార్కులో జరిగిన ర్యాలీలోకి చొరబడిన ఖలిస్థానీలు గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here