కాగజ్‌నగర్‌ ఇఎస్ఐ ఆసుపత్రి కధ ముగిసినట్లేనా

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ పట్టణం లో ఓకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల పరిధిలోని కార్మికులకు అత్యంత మెరుగైన వైద్య సౌకర్యాలందించిన కాగజ్ నగర్ పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రి కథ ముగిసినట్లేనా…. ఆసుపత్రి అలనాటి పూర్వ వైభవాన్ని మనం చూడగలమా… అనే సందేహాలకు ముగింపునిస్తూ నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) జారీ చేసిన నివేదిక బహిర్గతమైంది. ఈ ఆసుపత్రి భవనంతో పాటు డిస్పెన్షరీలు, క్వార్టర్లు అన్నీ శిథిలావస్థలో ఉండి మనుష్యులు ఉ ండేందుకు వీలుగా లేవని ఆ నివేదికలో స్పష్టం చేశారు. నిట్ (వరంగల్), సివిల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ డి రవి ప్రసాద్, డాక్టర్ బి ఉమేష్ సంతకాలతో కూడిన ఈ నివేదికలో ఈఎస్ఐ ఆసుపత్రి స్థితిగతులను పొందుపర్చారు. ఆసుపత్రిలో ఏ యే విభాగాలకు సంబంధించిన భవనాలు ఏ విధంగా ఉన్నాయనే విషయంలో సమగ్ర నివేదిక రూపొందించారు. కొన్ని భవనాలు పనికి వచ్చే విధంగా ఉన్నా ప్రధాన ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో మొత్తంగా ఈ ఆసుపత్రిని ‘అన్ఫిట్ భవనంగా ఆ నివేదికలో పేర్కొన్నారు. దీనితో ఈఎస్ఐ ఆసుపత్రి మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. కాగా ఆసుపత్రి భవనాలు అన్ఫిట్గా ఉ న్నాయని నిట్ నివేదిక బహిర్గతమైన సమయంలోనే డీఐఎంఎస్ (డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్) చేసిన తీర్మాణం కూడా బయటకు వచ్చింది. ఆ తీర్మాణంలో కాగజ్నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రి ఇన్స్యూర్డ్ పర్సన్సన్ను అందుబాటులో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయాలని తీర్మాణించారు. దీనిని బట్టి చూస్తే ఈ ఆసుపత్రిని ఇక్కడి నుండి మొత్తంగా ఎత్తివేసే ప్రయత్నం జరుగుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఆసుపత్రిపై గత కొన్నాళ్ల నుండి కార్మికులలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019, ఏప్రిల్ 12న ఈఎస్ఐ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్ ఈ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఈఎస్ఐ రీజనల్ డైరెక్టర్ రేణుకా ప్రసాద్, రాష్ట్ర వైద్యాధికారి ప్రదీప్, ఈఈ రవికుమార్ లు ఆసుపత్రిని సందర్శించారు. డిస్పెన్షరీలతో పాటు ఆసుపత్రి భవనాన్ని, అందులో నిరుపయోగంగా ఉన్న పరికరాలను పరిశీలించారు. విలువైన పరికరాలు ఉన్నా అందుబాటులో వైద్యులు లేక ఇన్ పేషెంట్ల సంఖ్య పూర్తిగా తగ్గుతోందని వారు గుర్తించారు. ఆసుపత్రి కొనసాగుతుందా లేక తరలిస్తారా అనే విషయం నిట్ నివేదికపై ఆధారపడి ఉంటుందని అప్పట్లోనే వారు విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం నిట్ నివేదిక అన్ఫిట్గా రావడంతో ఆసుపత్రి కొనసాగడంపై ప్రతిష్టంభన నెలకొంది.ప్రజానేత్ర రిపోర్టర్ ఆడెపు దేవేందర్

Leave A Reply

Your email address will not be published.