పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు. – జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ

జయశంకర్ భూపాలపల్లి, జూలై 22 ; పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ అన్నారు. ఆపరేషన్ ముస్కాన్ 8వ విడత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని మంజూరు నగర్ లో కొందరు బాల కార్మికులు భవన నిర్మాణరంగంలో పనిచేస్తున్నారని తెలుసుకొని జిల్లా సంక్షేమాధికారి కే.సామ్యూల్ ఆదేశాల మేరకు సహాయ కార్మిక అధికారిణి వినోదతో కలిసి పని ప్రదేశానికి చేరుకొని పిల్లలకు మరియు అక్కడ ఉన్న యజమాన్యానికి కౌన్సిలింగ్ నిర్వహించి బాల కార్మిక నిషేధ చట్టం-1986 గురించి వివరించారు. అక్కడ పనిచేస్తున్న పిల్లలని రక్షించి, వారి స్థితిగతుల్ని తెలుసుకొని బాలల సంక్షేమ సమితి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా డిసిపివో హరికృష్ణ మాట్లాడుతూ… 18 సంవత్సరాలు నిండకుండా పిల్లలను పనులలో పెట్టుకోకూడదని, ఒకవేళ పెట్టుకున్నట్లైతే అట్టి యజమానులపై, కాంట్రాక్టర్ల పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పిల్లలు ఆర్థిక, ఇతర కారణాల వల్ల చదుకు దూరమై బాల కార్మికులుగా, మరికొంతమంది బిక్షాటకులుగా మారుతున్నారని అన్నారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలు నిర్వహిస్తోంది అని తెలిపారు. ప్రజలు సైతం వివిధ పని ప్రదేశాలలో బాలలను గుర్తించినట్లైతే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు కాల్ చేసి తెలిపితే వెంటనే అట్టి బాలలను రక్షించి సంబందీకులపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. అనంతరం సహాయ కార్మిక అధికారిణి వినోద మాట్లాడుతూ… చాలా మంది పిల్లలు మన రాష్ట్రం నుండే కాకుండా ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి కూడా బతుకు దెరువు కోసం ఇక్కడికి వస్తున్నారు అన్నారు. బాల కార్మికులుగా వెట్టి చాకిరికి గురైన పిల్లలను గుర్తించి తీవ్రత ను బట్టి సదరు యజమానికి రు.20 వేల కు తగ్గకుండా జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. పిల్లలకు నష్ట పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. శుక్రవారం నాటి రెక్కీ లో వివిధ పని ప్రదేశాల నుండి పిల్లలను రక్షించి నిబంధనల ప్రకారం పోలీసు స్టేషన్ లో కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో బాలల సంరక్షణ అధికారి వెంకటస్వామి, సోషల్ వర్కర్ లింగారావు, చైల్డ్ లైన్ సిబ్బంది రామ్ చరణ్, విజయలక్ష్మి, పోలీసు కానిస్టేబుళ్లు కవిత, వీణ, చంద్రకళ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.