మారని బతుకులు.. తీరని గోసలు!

మహమ్మదాబాద్ మండలంలో దారుణం

– బాత్ రూం జీవిస్తున్న మహిళ
– పల్లె ప్రగతి పథకంలో ఇల్లు కూల్చివేత
– నాలుగేళ్లు అయినా మళ్లి చూడని అధికారులు
– తొలివెలుగుతో కష్టాన్ని చెప్పుకున్న బాధిత మహిళ
– తనకు న్యాయం చెయ్యాలని వేడుకుంటున్న బాధితురాలు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత సుపరిపాలన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని మాటలు చెప్పడం తప్ప చేతల్లో నిరూపంచడం కష్టం అనే విమర్శలు ప్రజల్లో నుండి వినిపిస్తుంటే..
రాష్ట్రంలో వెలుగు చూస్తున్న కొన్ని ఘటనలు అందుకు అద్దం పట్టినట్టుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు చూస్తుంటే.. చెప్పే మాటలకు.. చేసే చేతలకు పొంతన లేకుండాపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీడలేని నిరుపేదలకు గూడు కట్టించడమే రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్ష అని చెప్పుకునే నాయకుల కండ్లకు అబాగ్యుల కష్టం కనిపించట్లేదా..? అంటూ రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. అర్హులైన ప్రతీ పేదవాడికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఉన్నగుడిసెలు కూల్చి గూడు లేకుండా చేస్తున్నారని కంటనీరు పెట్టుకుంటున్నారు. మరీ దారుణంగా కొందరైతే అవి కూడా లేక మరుగుదొడ్లల్లో జీవిస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి దుస్థితి పగవాళ్లకు కూడా రావద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మహిళ మరుగుదొడ్డిలో జీవనం గడుపుతున్నట్టు తెలుసుకున్న తొలివెలుగు పలు కథనాలను ప్రసారం చేసింది. తొలివెలుగు కథనాలకు స్పందించిన కొందరు దాతలు.. ఆ మహిళకు ఇల్లు నిర్మాణం చేయించి ఇచ్చారు. ఆ ఘటన మరవక ముందే అలాంటి మరో ఘటన తొలివెలుగు బయపెట్టింది. అంతకు మించిన దుర్భర జీవితాన్ని గడుపుతూ.. మరుగుదొడ్లోనే బతుకెళ్లదీస్తున్న మహిళ తొలివెలుగు ముందుకు వచ్చింది.మహమ్మదాబాద్ మండలం చిన్నపల్లి గ్రామంలో పల్లె ప్రగతి పథకంలో భాగంగా నాలుగేళ్ల క్రితం శిథిలావస్థకు చేరిన కొన్ని ఇండ్లను కూలచేశారు ప్రభుత్వ అధికారులు. అందులో లక్ష్మమ్మ అనే మహిళ ఇంటిని కూల్చివేశారు. ఇండ్లు కోల్పోయిన బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించి ఇస్తామని నమ్మబలికారు. కానీ.. నాలుగేళ్లు గడిచినా ఇంత వరకు అటు దిక్కు చూసిన నాధుడే కరువయ్యాడంటూ గోడెళ్లబోసుకుంది లక్ష్మమ్మ.డబుల్ బెడ్ రూం సంగతి దేవుడెరుగు కానీ.. తనకు నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్న ఇల్లును కోల్పోవడంతో తనకు ఇప్పుడు ఆ బాత్ రూం దిక్కైందని చెప్తోంది. డబుల్ బెడ్ రూం ఇస్తారనే నమ్మకం ఎలాగు లేదు. కానీ.. తన గుడిసేను తనకు నిర్మించి ఇచ్చినా చాలు అంటూ కంటనీరు పెట్టుకుంది బాధితురాలు. తన లాంటి దుస్థితి మరే పేదవాడికి రావొద్దని ఆ దైవాన్ని వేడుకుంటున్నానని చెప్పింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంది.

Leave A Reply

Your email address will not be published.