మన ఊరు – మన బడి కార్యక్రమంలో గుర్తించిన పనుల పూర్తికి చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, మే 12: మన ఊరు – మన బడి కార్యక్రమంలో గుర్తించిన పనులు గ్రౌండింగ్ చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో మన ఊరు – మన బడి కార్యక్రమ పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఈ కార్యక్రమం క్రింద మొదటి విడతగా 149 పాఠశాలలను గుర్తించి, అన్ని విధాలా వాటి అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమ పర్యవేక్షణకు మండలాల వారిగా జిల్లా అధికారులను మండల ప్రత్యేక అధికారులుగా, నియోజకవర్గాల వారిగా భూపాలపల్లి కి అదనపు కలెక్టర్, మంథనికి జాయింట్ కలెక్టర్ ను నియమించినట్లు ఆయన అన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కిచెన్ షెడ్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని, మిగిలిన అంశాలైన త్రాగునీరు, విద్యుద్దీకరణ, డైనింగ్ హాల్ నిర్మాణం, నూతన తరగతుల నిర్మాణం, పాఠశాల గదుల మరమ్మతులు మొదలైన పనులు సాఫ్ట్ వేర్ వినియోగించి ప్రతిపాదనలు రూపొందించాలని అన్నారు. ప్రత్యేక అధికారులు వ్యక్తిగత శ్రద్ధతో ప్రతి పాఠశాల పనుల ప్రతిపాదనలను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ప్రతిపాదించాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి, మార్గదర్శకాల మేరకు ఎన్ని టాయిలెట్ బ్లాకులు కావాలో, అందులో బాలికల, బాలురవి ఎన్నో, ఎన్ని తరగతి గదులు ఉన్నవి, అదనంగా ఎన్ని కావాలి, ఉన్న గదులకు ఏ ఏ మరమ్మతులు అవసరమున్నది సూచించాలన్నారు. ప్రత్యేక అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, మండల విద్యాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి పనిని ప్రత్యేక అధికారి పరిశీలన చేయాలన్నారు. పనులు ప్రారంభం అయినవి, ప్రతిరోజూ కొనసాగేలా, త్వరితగతిన పూర్తి అయ్యేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పనుల్లో పురోగతి లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె. స్వర్ణలత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర టీఎస్, జెడ్పి సిఇఓ ఎన్. శోభారాణి, డిఆర్డీవో డి. పురుషోత్తం, పీఆర్ ఇఇ ఏ. వెంకటేశ్వర్లు, జిల్లా బిసి వెల్ఫెర్ అధికారిణి టి. శైలజ, డిసిఓ ఎం. మద్దిలేటి, డిపివో లత, డిహెచ్ఎస్వోఎం.ఏ. అక్బర్, డిఎఫ్ఓ ఆర్. అవినాష్, జిల్లా ఎస్సి వెల్ఫెర్ అధికారిణి సునీత, డీఏఓ విజయభాస్కర్, ఇంజనీరింగ్ అధికారులు, మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.