నేడే జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. శ్రీరామ్

జయశంకర్ భూపాలపల్లి, మే 15:  జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం పురస్కరించుకుని అన్ని ప్రాధమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. డి. శ్రీరామ్ అన్నారు. ప్రతి సంవత్సరం మే 16 ను జాతీయ డెంగ్యూ దినోత్సవంగా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పారిశుద్ధ్యం పకడ్బందీగా నిర్వహించడం డెంగ్యూ నివారణకు సరైన మార్గమని ఆయన అన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని, తద్వారా దోమలు పుట్టకుండా చేసినట్లయితే డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని ఆయన తెలిపారు. రానున్న వర్షాకాలంలో జిల్లా ప్రజలంతా పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దోమలు పుట్టకుండా చేయవచ్చునని, దోమల ద్వారా వచ్చే వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, పైలేరియా, మెదడువాపు లాంటి వ్యాధులు రాకుండా చేయవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి అన్నారు. ప్రజలందరూ దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. డ్రై డే ను పాటిస్తూ, పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని, ఇండ్లలోని కూలర్లలోని నీటిని ఎప్పటి కప్పుడు మార్చుకోవాలని ఆయన తెలిపారు. కొబ్బరిబొండాలు, పూలకుండీలు, టైర్లు, రోళ్ళు, పాడుబడిన ప్లాస్టిక్ సామానులలో నీరు నిల్వ లేకుండా చూడాలని, ఈ విషయాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, కీటక జనిత వ్యాధులపై ప్రజలలో పూర్తి అవగాహన కల్పించి, చైతన్యం తేవాలన్నారు. జ్వరము, తలనొప్పి, ఒంటినొప్పులు, చర్మముపై ఎర్రటి దద్దుర్లు వుంటే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని ఆయన కోరారు. అందరూ సమిష్టిగా కృషి చేసినట్లయితే కీటకాల ద్వారా వచ్చే వ్యాధులు నియంత్రణ చేయవచ్చని ఆయన తెలిపారు. నేటి డెంగ్యూ నివారణా దినోత్సవాన్ని విజయవంతం జేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కోరారు.

Leave A Reply

Your email address will not be published.