ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు భేష్ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 25: రేగొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు భేషుగ్గా ఉన్నట్లు, కార్పొరేట్ ఆసుపత్రి సదుపాయాలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం కేంద్ర మంత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రేగొండ మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని డ్రెస్సింగ్, ఇంజక్షన్ గది, టీకాల గది, ల్యాబ్, ఇన్ పేషంట్ విభాగం, లేబర్ రూమ్ లను పరిశీలించారు. ప్రతి విభాగంలో ఉన్న పరికరాలు, సిబ్బంది వివరాలు, చేపడుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగులతో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు నుండి వలస వచ్చి, కూలి పనులకు వెళుతున్న కుటుంబంలోని శ్రీరాం అనే పిల్లవాడిని చదువు విషయమై అడగగా, చదువు మానివేసినట్లు జవాబు ఇవ్వడంతో, పిల్లవాని అమ్మమ్మ అంజమ్మను పిల్లవానిని చదివించాలని, ప్రభుత్వ హాస్టళ్లలో ఉచిత విద్య, భోజనం, వసతికల్పన ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్య వైద్యం ఉపాధి కార్యక్రమాలలో పురోగతిలో భాగంగా ప్రధాని నరేంద్రమోడి సూచన మేరకు ఎంపిక చేసిన వెనుకబడిన జిల్లాలు ఆస్పిరేషన్ జిల్లాల కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కార్యక్రమ అమలు తీరును ప్రధాని ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. జిల్లా యంత్రాంగాన్ని ప్రోత్సహించి, వారికి లక్ష్యం దిశగా కార్యోన్ముఖులను చేయాలని ప్రధాని ఆదేశించినట్లు ఆయన అన్నారు. ప్రపంచంలో కరోనా వారియర్స్ ని గుర్తించింది భారత దేశం ఒక్కటేనని, వారికి ఇన్సూరెన్స్ కల్పించడం, జ్యోతులు వెలిగించడం, విమానాలతో ప్రభుత్వ ఆస్పత్రులపై పూల వర్షం కురిపించడం చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు, మొదటి, రెండో విడత వ్యాక్సినేషన్ పూర్తయినట్లు, త్వరలో 5-12 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ కి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు. కరోనా 4వ వేవ్ రాకుండా ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలన్నారు. ప్రపంచంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, శక్తిశాలి దేశంగా భారత దేశం రూపుదిద్దుకోవాలని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఆదర్శ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దినందుకు జిల్లా కలెక్టర్, వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.అనంతరం కేంద్ర మంత్రి పాండవులగుట్టను సందర్శించారు. పాండవుల గుట్ట ప్రాధాన్యత, ప్రాముఖ్యతను జిల్లా అటవీ శాఖ అధికారిణి లావణ్య మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 8 ప్రాంతాలు మాత్రమే పురావస్తు శాఖ పరిధిలో ఉన్నాయని, పాండవుల గుట్టను శాఖ ఆధీనంలో తేవడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. పురావస్తు శాఖ పరిధిలోకి వస్తే, నిధులు వస్తాయని, గొప్ప పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి రేగొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటి, నీరు పోశారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంట జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, అదనపు కలెక్టర్ దివాకర, డిఎఫ్ఒ లావణ్య, పురావస్తు శాఖ సర్వే సంచాలకులు స్మిత, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా శ్రీరామ్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సామ్యూల్, అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.