దళితుల పక్షపాతి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల పక్షపాతి అని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. శనివారం భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో దళితులకు 3 3ఎకరాల భూ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి లతో పాల్గొని దళిత ఎస్సి మహిళా లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ, ప్రభుత్వానికి దళితుల పట్ల ఎనలేని ప్రేమ ఉందని, ఏ పథకం ప్రవేశపెట్టిన దళితులకు లాభం చేకూర్చేలా ఉంటుందని అన్నారు. దళిత బంధు గొప్ప పథకమని, ప్రతి దళితునికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని, అట్టి మొత్తంతో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి దళితులు రావాలని, దశలవారీగా దళితులందరికి వర్తింపజేస్తారని ఆయన అన్నారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, రూ. 3 కోట్ల 44 లక్షల 44 వేల 3 వందల రూపాయలతో 49 ఎకరాల 31 గుంటల వ్యవసాయ భూమిని 40 మంది నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాల మహిళలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. గిరివికాసం పథకం క్రింద అభివృద్ధికి యూనిట్లు మంజూరు చేశామన్నారు. దళితబంధు యూనిట్లను త్వరలో గ్రౌండింగ్ చేస్తామన్నారు. ప్రభుత్వం వివిధ శాఖల్లో త్వరలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్సి వర్గానికి చెందిన గ్రూప్ 2 ఉద్యోగార్థులు 100 మందికి, పోలీస్ ఉద్యోగార్థులు 50 మందికి ప్రభుత్వంచే ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన అన్నారు. గ్రామం నుండి ఉన్నత ఉద్యోగాల్లో ఎంపిక కావాలన్నారు. మహిళల సాధికారతకు మహిళల పేరునే పట్టాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. భూ కొనుగోలులో అన్ని సమస్యలు పరిష్కరించిన మీదట పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ అన్నారు.కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ, దళిత వర్గాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. 24 గంటల కరంటు, రైతు బంధు, రైతు భీమా, ఆసరా పించనులు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ఏ రంగంలో తీసుకున్న ఇంత గొప్పగా ఏ రాష్ట్రంలో లేవన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు రావాలన్నారు. కూరగాయల సాగుకు రైతులు సమాయత్తం కావాలన్నారు. దళిత బంధు కార్యక్రమంలో లబ్ధిదారులు అందరూ ఒకే యూనిట్ కాకుండా పౌల్ట్రీ, కూరగాయల సాగు, లాభదాయక యూనిట్లు ఎంచుకొని, ఆర్థికంగా, స్వంతంగా పైకి రావాలన్నారు. పట్టణానికి దగ్గర్లో ఉన్న గ్రామం గొర్లవీడు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. గ్రామ రహదారి వ్యవస్థ బలోపేతం చేస్తామన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద పాఠశాలల అభివృద్ధి చేపట్టినట్లు, ఇందులో పాఠశాలలు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అర్హులందరికీ ఆసరా పించనులు ఇస్తామన్నారు. యాసంగి వడ్లను ఎంత నష్టమైనా రాష్ర్ట ప్రభుత్వమే కొంటున్నదన్నారు. దళితులకు పంపిణీ చేసిన భూమికి బోర్లు, సాగుకు అన్ని విధాల ఉపయోగం లోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ, దళితులకు భూ పంపిణీ సద్వినియోగం చేసుకొని, దళితులు అభివృద్ధి చెందాలన్నారు. దళితబంధు ద్వారా మొదటి విడతగా నియోజక వర్గానికి 100 మంది లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలు అందజేస్తున్నట్లు, వచ్చే సంవత్సరం దళితబంధు కు 30 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించనుందని అన్నారు. ఉపాధిహామీ క్రింద దివ్యంగులకు వారు ఉన్న ప్రదేశాల్లోనే వారు చేయగల పనులు అప్పగించనున్నట్లు ఆయన అన్నారు. సంక్షేమ రంగంలో ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులకు భూ పట్టాల పంపిణీ చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న 5 జంటలకు ప్రోత్సాహక నగదు బాండ్లు అందజేశారు. ఇటీవల జరిగిన యుపిఎస్సి పరీక్షల్లో ర్యాంక్ సాధించి ఐపీఎస్ అర్హత పొందిన గొర్లవీడు గ్రామానికి చెందిన కంకణాల రాహుల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఇడి ఎస్సి కార్పొరేషన్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్సి సంక్షేమ అధికారిణి సునీత, ఎంపిపి లావణ్య, గ్రామ సర్పంచ్ టి. శంకరయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.