దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 26:
జిల్లాలో దళితబంధు పథక యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో దళితబంధు పథక అమలుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితబంధు పధకం క్రింద జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో భూపాలపల్లి కి 90, మంథని కి 60, ములుగుకు 1, మొత్తం 151 మంది లబ్దిదారులకు ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున కేటాయించామన్నారు. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి 90 మంది లబ్దిదారుల్లో 57 మంది రవాణా యూనిట్లు, 34 మంది రవానేతర యూనిట్లు ఎంచుకోగా, మంథనికి సంబంధించి 36 రవాణా, 24 రవానేతర యూనిట్లు ఎంచుకొన్నట్లు ఆయన అన్నారు. ప్రతి విభాగానికి, ఆయా విభాగానికి సంబంధించిన ఒక జిల్లా స్థాయి అధికారిని మెంటర్ గా నియమించినట్లు ఆయన తెలిపారు. ఇట్టి అధికారి, వారి వారి విభాగానికి సంబంధించి లబ్దిదారుల పూర్తి వివరాలు, మొబైల్ నెంబర్లతో సహా సేకరించాలని, ఆయా యూనిట్లు గ్రౌండింగ్ అయేవరకు లబ్దిదారునికి అన్ని విధాలా సహాయసహకారాలు అందించాలని, నిరంతరం అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. ఇప్పటికే యూనిట్ల ఎంపికపై లబ్ధిదారులకు 2 అవగాహనా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. యూనిట్ ఏర్పాటు, లాభదాయక నిర్వహణపై లబ్దిదారునికి పూర్తి అవగాహన కల్పించడం అధికారుల బాధ్యతని ఆయన అన్నారు. ప్రతి లబ్దిదారుని పూర్తి బయోడేటా, వారికి ఏ ఏ రంగాల్లో ఎంత మేర అనుభవమున్నది, వారు ఇంతకుముందు ఏమి చేసింది తదితరాలన్ని సేకరించాలన్నారు. యూనిట్ ధర 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉన్నచో, ఇద్దరూ లేదా ముగ్గురు, యూనిట్ ధరను బట్టి కలిసి, యూనిట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. విభాగాల వారిగా లబ్దిదారులను, మండల అధికారులు, జిల్లా బాధ్యులతో సమావేశమై, యూనిట్ల పట్ల పూర్తి అవగాహన కల్పించాలన్నారు. యూనిట్లు ఇది వరకే గ్రౌండింగ్ అయిన ఇతర జిల్లాల అధికారులతో, గ్రౌండింగ్ కు తీసుకున్న చర్యలు, వారి అనుభవాలను తెలుసుకొని ముందుకు వెళ్ళాలన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమని అధికారులు వ్యక్తిగత శ్రద్ధ తో చర్యలు చేపట్టాలని, మే మొదటి వారంలో కొన్ని యూనిట్ల గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో ఇడి ఎస్సి కార్పొరేషన్ ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి ఎం. విజయ భాస్కర్, జిల్లా ఉద్యానవన అధికారి ఎం.ఏ. అక్బర్, జిల్లా పశు సంవర్థక అధికారి ఏ. కుమారస్వామి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి. శ్రీనివాస్, ఎల్డిఎం ఎన్. శ్రీనివాసరావు, ఎంవిఐ మహ్మద్ సంధాని, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.