చిరు ధాన్యాల వాడకంతో పోషక లోపం దూరం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 19: చిరు ధాన్యాల వాడకంతో పోషక లోపం దూరం చేయవచ్చని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంగళవారం స్థానిక ఇల్లందు క్లబ్ లో అంగన్వాడీ కేంద్రాల్లో చిరు ధాన్యాల వాడకంపై సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందికి ఏర్పాటుచేసిన అవగాహనా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో 112 ఆకాంక్ష జిల్లాలను గుర్తించి, వాటిని అభివృద్ది పర్చడానికి నీతి ఆయోగ్, కొన్ని కార్పొరేట్ సంస్థల సహకారంతో చర్యలు చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 3 జిల్లాలు ఎంపిక చేయగా, అందులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఒకటని ఆయన అన్నారు. ఇందులో వైద్యం, విద్య, పౌష్టికాహారం, సేద్యం, జలవనరులు, ఆర్థిక, నైపుణ్యాభివృద్ది, మౌళిక సదుపాయాల కల్పనలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన అన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌళిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ భవనాల్లో వున్న అంగన్వాడీ కేంద్రాల పునర్ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అంగన్వాడీల్లో చిరు ధాన్యాల వాడకానికి చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టి, అక్కడి రైతులు చిరు ధాన్యాలు పండించే విధంగా ప్రోత్సహించడం, వారు పండించిన పంటను సేకరించడం, ఫుడ్ ప్రాసేస్సింగ్ యూనిట్ ఏర్పాటు, పిల్లలు చిరు ధాన్యాల వంటకాలు ఇష్టపడే విధంగా తయారు చేయడం ప్రణాళికాబద్దంగా చేపడతామన్నారు. పోషక లోపం నుండి పిల్లలు, గర్భిణులు, బాలింతలు బయటపడదానికి చిరు ధాన్యాల వాడకం ఎంతో మంచిదని ఆయన తెలిపారు. సంక్షేమ శాఖ సిబ్బందికి చిరు ధాన్యాలతో తయారుచేసే వంటకాలపై శిక్షణ ఇస్తున్నట్లు, ఇట్టి శిక్షణ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 24 వరకు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. శిక్షణ అనంతరం ఫుడ్ ఫెస్టివల్స్ ఏర్పాటుచేసి, అందులో అధికారులు, ప్రజాప్రతినిధులను బాగస్వామ్యం చేసి, వారి అభిప్రాయాలు, సూచనలతో వంటకాలను ఇష్టంగా తినే విధంగా తయారు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రైతుల నుండి సేకరించిన చిరు ధాన్యాలతో జిల్లాలోని అంగన్వాడీలు, సంక్షేమ వసతి గృహ పిల్లలకు సరిపోను వంటకాలు తయారుచేసే విధంగా ప్రణాళిక చేయాలన్నారు. రాబోయే 5 – 6 నెలల్లో ఇట్టి ప్రక్రియ కార్యరూపం దాల్చాలన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, రైతులు చిరు ధాన్యాలు పండించే విధంగా ప్రోత్సహించాలన్నారు. చిరు ధాన్యాల పై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుత జీవన విధానంలో వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని, చిరు ధాన్యాల వాడకంతో ఆరోగ్యం బాగుంటుందని ఆయన తెలిపారు.కార్యక్రమంలో చిరు ధాన్యాల బొమ్మలతో సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించిన స్టిక్కర్లు, చిరు ధాన్యాల ఉపయోగం, పర్యావరణానికి ఏం లాభం లపై రూపొందించిన పోస్టర్లు, చిరు ధాన్యాల వంటకాలపై ప్రచురించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో శిక్షణలో భాగంగా చిరు ధాన్యాలతో తయారుచేసిన వంటకాలను కలెక్టర్, అధికారులు ఆరగించి, సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ సెగ్గెo వెంకట రాణి, జిల్లా సంక్షేమ అధికారి కె. సామ్యూల్, జిల్లా అధికారులు, వాసన్ స్వచ్చంద సంస్థ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు శ్రీనివాస్, లక్ష్మణ్, సిడిపివోలు, సూపర్వైజర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.