ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు ; కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 19: మే 6 నుండి ఇంటర్, మే 23 నుండి జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షలు 6 మే నుండి 20 మే వరకు, పదో తరగతి పరీక్షలు 23 మే నుండి 1 జూన్ వరకు జరగనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 10, పదో తరగతి పరీక్షలకు 20 కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షకు 1997, రెండో సంవత్సర పరీక్షకు 1765, పదో తరగతి పరీక్షలకు 3717 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో పరీక్షా ప్రశ్న పత్రాలను నిల్వచేయుటకు తగిన ఏర్పాట్లు చేయాలని, పటిష్ట బందోబస్తు కల్పించాలని ఆయన అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, వేసవి దృష్ట్యా త్రాగు నీరు, విద్యుత్ సరఫరా వుండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్షల సజావు నిర్వహణకు ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ చేయాలని ఆయన అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయాలని, దగ్గరలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణ అనంతరం సమాధాన పత్రాల తరలింపు ప్రక్రియ పోస్టల్ శాఖ ద్వారా చేయాలని ఆయన అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు నడపాలని కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని నియమించాలని, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆయన అన్నారు. పరీక్షా సమయంలో అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి తప్పిదాలు లేకుండా సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో ఆదనపు ఎస్పీ శ్రీనివాసులు, భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, ఎస్ఇ ఎన్పిడిసిఎల్ మల్చూర్, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. డి. శ్రీరామ్, ఇంటర్ విద్యా నోడల్ అధికారి దేవరాజన్, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సంధాని, ఎస్టీఓ సతీష్, వివిధ శాఖల అధికారులు.

Leave A Reply

Your email address will not be published.