కొవిడ్ నియంత్రణ దిశగా పూర్తిస్థాయి చర్యలు – రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం

ప్రజానేత్రన్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్,తేదీ:20-01-2022; కొవిడ్ నియంత్రణ దిశగా అన్ని శాఖల సమన్వయంతో పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కొవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ గ్రామాల వారీగా, వార్డుల వారీగా టీం లను ఏర్పాటు చేసి శుక్రవారం నుండి ప్రతిరోజు 25 ఇండ్లలో ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని, ఇంటింటి సర్వే బృందాలలో ఆశా వర్కర్, ఆరోగ్య కార్యకర్తలు గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇతర అధికారులు సమన్వయంతో ఇంటింటి జ్వరం సర్వేను విజయవంతం చేయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ ఇంతవరకు కొవిడ్ తో మరణించిన వారికి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం త్వరగా అందించేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఆర్థిక సహాయం మంజూరుకు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, మీ-సేవ ద్వారా ధరఖాస్తు చేసుకున్న కేసులను కమిటీ వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగిందని, రెండవ డోసు అర్హులైన వారందరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.