మునిసిపాలిటీ బకాయిలు వసూల్ చేయాలి ; కలెక్టర్ భవేశ్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 18 ప్రజానేత న్యూస్ ; భూపాలపల్లి మున్సిపాలిటీలో బకాయి పనులన్నింటిని వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మున్సిపల్, సింగరేణి అధికారులతో సమావేశం నిర్వహించి మున్సిపాలిటీ పన్నుల వసులుపై సమీక్షించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ భూపాలపల్లి మున్సిపాలిటీకి 32 కోట్ల రూపాయల పన్ను బకాయిలు ఉండదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలపగా సింగరేణి సంస్థ నుండి బకాయి పన్నులను వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా త్వరగా మున్సిపాలిటీకి బకాయి ఉన్న పన్నులను చెల్లించాలని సింగరేణి జిఎం శ్రీనివాసరావును ఆదేశించారు. పట్టణంలో ఇంటి పన్నులతో పాటు అన్ని రకాల దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి వాణిజ్య పన్నులను వంద శాతం వసూలు చేయాలని అన్నారు. నిషేధిత ప్లాస్టిక్ ను వాడకూడదని ఇప్పటికే వ్యాపార సంస్థలకు తెలియజేసినందున ఇకనుండి రెగ్యులర్గా దాడులు చేసి ప్లాస్టిక్ వాడకం జరగకుండా చూడాలని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన సీసీ, బిటి రోడ్లు, వైకుంఠధామాలు, చెత్త డంపింగ్ యార్డ్, మార్కెట్ తదితర నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. తడి చెత్త- పొడిచెత్త సేకరణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి పట్టణ ప్రజలను చైతన్యం చేసి పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసిన వార్డులను స్వచ్ఛ్ వార్డులుగా ప్రకటించాలని అన్నారు. పట్టణంలో ఇంటింటికి మిషన్ భగీరథ నీరు అందించేందుకు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా చేపట్టిన పైప్ లైన్, వాటర్ ట్యాంకుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, సింగరేణి,పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో పిఎంజిఎస్ వై, ఆర్డిఎఫ్, డిఎంఎఫ్టి, ప్లాన్, 2 బిహెచ్ కె తదితర నిధులతో చేపట్టి నిర్మాణంలో గల వంతెనలు, నూతన రోడ్ల నిర్మాణం, రోడ్ల వెడల్పు, కలెక్టరేట్ భవన సముదాయ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి ఇఇ వెంకటేష్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఇ. రమేష్, ఎఇలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.