ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి. జిల్లా కలెక్టర్ మిశ్రా.

జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 25 ; ప్రజల సమస్యలను బాధ్యతగా తీసుకొని సమస్యలను పరిశీలించి సకాలంలో పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జిల్లా అధికారులను ఆదేశించారు. నూతనంగా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన భవేశ్ మిశ్రా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి, వివిధ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు తమ సమస్యలను పరిష్కరిస్తారని ఎంతో ఆశతో సామాన్య ప్రజానీకం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తారని అధికారులు వారికి సమయం కేటాయించి వారి సమస్యలను తెలుసుకొని మీ స్థాయి లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మీ పరిధిలో లేనిదానిని పై స్థాయి అధికారులకు పంపించాలని, చట్టప్రకారం సాధ్యం కానీ సమస్యలను సంబంధిత దరఖాస్తుదారులకు వివరంగా తెలియజేయాలని అన్నారు. దరఖాస్తులను అన్నింటిని ఈ ఆఫీసు ద్వారా ఆన్లైన్లో పొందుపరిచి దాన్ని పరిష్కారానికి తీసుకున్న చర్యలను కూడా ఆన్లైన్లో పొందుపరచాలని అన్నారు. హైకోర్టు, లోకాయుక్త, మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల లో పెండింగ్లో ఉన్న వివిధ దరఖాస్తుల వివరాలను అందించాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కచ్చితంగా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని, వ్యాక్సిన్ వేసుకొని వారిని గుర్తించి వారి ఇళ్ల వద్దకు రేషన్ డీలర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెళ్లి మోటివేట్ చేసి వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు చేపట్టాలని, తక్కువ వ్యాక్సినేషన్ నమోదైన మారుమూల గిరిజన ప్రాంతాలలో ప్రత్యేక బృందాల ద్వారా పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ చేయాలని అన్నారు. కెసిఆర్ కిట్ పథకం ప్రకారం గర్భిణీలకు రెగ్యులర్గా వైద్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు పొంది ఆర్థికంగా లబ్ధి పొందేలా పేద ప్రజలకు అవగాహన పెంపొందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అధికమంది పేద ప్రజలు లబ్ధి పొందేలా పనిదినాలను పెంచాలని, మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకలు జరగకుండా చర్యలు చేపట్టాలని, నిర్మాణంలో ఉన్న కలెక్టర్ కార్యాలయ కాంప్లెక్స్, ఇతర రహదారుల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను, ఆసరా పింఛన్లులను అందించేలా చర్యలు చేపట్టాలని, వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలలో రైతులను ప్రోత్సహించాలని, తూకాలలో మోసపోకుండా క్రమంగా దాడులు నిర్వహించాలని, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన నిర్మాణాలను సద్వినియోగం చేయాలని, షెగ్రీగేషన్ షెడ్లను ఉపయోగించి పొడిచెత్త- తడిచెత్త వేరు చేయాలని, చెత్త డంపింగ్ యార్డ్ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ లో మిషన్ భగీరథ త్రాగునీరు అందించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి ప్రజావాణి కార్యక్రమం ద్వారా అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, ఆర్డీవో శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.