కొవిడ్‌ ప్రభావంతో పరిమితంగా దర్శన టికెట్లు: ఈవో జవహర్‌రెడ్డి

తిరుమల: ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను డీనోటిఫై చేసేవరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని, అప్పటి వరకు తిరుమల శ్రీవారి దర్శనానికి పరిమితంగానే టికెట్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. శనివారం తితిదే పరిపాలన భవనంలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి భక్తులు ఫోన్ ద్వారా చేసిన ఫిర్యాదులు, సలహాలను ఈవో స్వీకరించి సమాధానాలు ఇచ్చారు.కరోనా మూడో దశకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని దర్శన టికెట్లను పరిమితం చేశామని చెప్పారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు నెలలో దర్శన కోటా టికెట్లను 5వేల నుంచి 8వేలకు పెంచామని వివరించారు. తిరుమలలో ఇటీవల చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను భక్తులకు వివరించారు.తిరుమలలోని హనుమంతుని జన్మస్థలంపై త్వరలోనే సమగ్ర గ్రంథాన్ని విడుదల చేస్తామని తెలిపారు. ఆకాశ గంగలో ఆంజనేయస్వామి విగ్రహంతో పాటు థీమ్‌ పార్కు నిర్మిస్తామని చెప్పారు. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాటిని శ్రీవారి నైవేద్యంతో పాటు భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు విస్తృత చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జూలై నెలలో హుండీ ఆదాయం రూ.55.58కోట్లు వచ్చిందని, శ్రీవారిని 5.32 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తితిదే అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, జేఈవో సదాభార్గవి, సీవీఎస్‌వో గోపినాథ్‌రెడ్డి, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.