పాఠశాలలను త్వరలో తెరుస్తాం: మంత్రి సురేష్
అమరావతి: రాష్ట్రంలో ఆగస్టులో పాఠశాలలను తిరిగి తెరిచే ప్రణాళికలను రూపొందిస్తున్నామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ఇవాళ మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ, తరగతులను ఎలా ప్రారంభించాలో కోవిడ్-19 మూడవ వేవ్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థులను రెండు బ్యాచ్‌లుగా చేసి, 50శాతం హాజరుతో పాఠశాలలను తెరవడానికి ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత విద్యా సంవత్సరంలో తరగతులు భౌతికంగా నిర్వహించలేకపోయామన్నారు. విద్యార్థులకు వ్యాక్సినేషన్ లేకుండా ప్రారంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ఇప్పట్లో స్కూళ్లు తెరిచే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.