కొట్టనంటే పోలీసుల ముందు లొంగిపోతా: ట్విటర్ ఉద్యోగి
బెంగళూరు: తనను అరెస్టు చేయరని, భౌతికంగా దాడి చేయరని హామీ ఇస్తేనే పోలీసుల ముందు లొంగిపోతానని ట్విటర్ ఇండియా ఉద్యోగి మనీశ్ మహేశ్వరి కర్ణాటక హైకోర్టుకు విన్నవించారు.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో ఒక ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన వీడియోను ట్విటర్ లో షేర్ చేయడం, అది వివాదాస్పదం కావడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఐటి చట్టాలను ఉల్లంఘిస్తున్నారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐటి చట్టాలను ఉల్లంఘించిన మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని, వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ యూపి పోలీసులు బెంగళూర్ లోని ట్విటర్ ఉద్యోగి మనీష్ మహేశ్వర్ కు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఈ కేసు పై ఇవాళ కర్ణాటక హైకోర్టులో వాదనలు జరిగాయి. తాను జూమ్ యాప్ ద్వారా విచారణకు హాజరవుతానని, కొట్టనని ముందుగా హామీ ఇవ్వాలని కోరగా యుపి ప్రభుత్వం తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. విచారణకు హాజరు కావాలని 26 నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించలేదని తెలిపారు. తనకు ఈ వివాదంతో సంబంధం లేదని తాను సాధారణ ఉద్యోగినని ఆయన తరఫు న్యాయవాది విన్నవించారు. తదుపరి విచారణ ను బుధవారానికి (రేపు) హైకోర్టు వాయిదా వేసింది.